న్యూఢిల్లీ: పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రైల్వే శాఖ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రైల్వే శాఖలోని 11.72 లక్షల మంది ఉద్యోగులకు బోనస్ దక్కనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (అక్టోబర్ 3) కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలోనే రైల్వే ఉద్యోగాలకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదనలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో పాటు ఈ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేశంలోని మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా ఇచ్చేందుకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. కేబినెట్ నిర్ణయంతో మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాళీ, ప్రాకృతం భాషలకు ప్రాచీన హోదా దక్కింది. ఇప్పటి వరకు దేశంలోని ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉంది.
Also Read :- సనాతన ధర్మాన్ని దూషించేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి
తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా ఈ ఆరు భాషలకు మాత్రమే ఇప్పటి వరకు ప్రాచీన హోదా ఉండగా.. తాజాగా మరో ఐదు భాషలు ఈ జాబితాలో చేరాయి. దీంతో దేశంలో ప్రాచీన హోదా కలిగిన భాషాల సంఖ్య 11కు చేరింది. ఇదిలా ఉండగా.. రూ.10,103 కోట్లతో వంటనూనె నూనె గింజల జాతీయ మిషన్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా చెన్నై మెట్రో రెండో దశ విస్తరణ పనులకు మోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మెట్రో రెండో దశ విస్తరణకు రూ.63,246 కోట్లతో తమిళనాడు ప్రభుత్వం పంపిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.