తిరుమల లడ్డూ వివాదం రాజకీయ దుమారం రేపిన క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం ( అక్టోబర్ 2, 2024 ) వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్ష విరమించారు పవన్ కళ్యాణ్. అనంతరం గురువారం ( అక్టోబర్ 3, 2024 ) తిరుపతిలో వారాహి బహిరంగసభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కోర్టులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని దూషించే వారికే కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని అన్నారు.
చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే... సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపిస్తాయని అన్నారు పవన్ కళ్యాణ్.అయిన వాళ్లకి ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించిందని. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.
ALSO READ | తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
భారతీయుడిగా, హైందవ ధర్మాన్ని పాటించేవాడిగా మీ ముందుకొచ్చానని... హిందుత్వాన్ని పాటిస్తానని అన్నారు.అన్ని మతాలను గౌరవిస్తానని.. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని అన్నారు. ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగిందని ప్రాయశ్చిత దీక్ష చేపడితే దాన్ని అపహాస్యం చేసారని అన్నారు. నా సనాతన ధర్మాన్ని నేను పాటించడం కూడా వారికి పాపంలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం ప్రశ్నల వెల్లువ.. భక్తుల మనోభావాలతో ఆటలొద్దంటూ సీరియస్..
సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని... దానికోసం తన పదవి, జీవితం కూడా త్యాగం చేస్తానని అన్నారు. రాజకీయ జీవితం పోయినా బాధపడనని... ఎప్పుడూ ధర్మం తప్పలేదని అన్నారు పవన్ కళ్యాణ్.