సీఎస్​పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ అసహనం 

సీఎస్​పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ అసహనం 

విభజన సమస్యలు తీరాలని లేదా?

సీఎస్​పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ అసహనం 

ఈ-సమీక్ష పోర్టల్​లో వివరాలెందుకు పెడ్తలేరని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలు, హామీలు పరిష్కారం కావాలని తెలంగాణ ప్రభుత్వానికి లేనట్లు ఉందని కేంద్రం సీరియస్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలతో పాటు ఇతర హామీల అమలుపై ఎప్పటికప్పుడు వివరాలను ఈ–సమీక్ష పోర్టల్​లో ఎందుకు అప్​డేట్ చేయడం లేదని ప్రశ్నించింది. ఇలాగైతే రాష్ట్రానికి రావాల్సినవి ఎలా వస్తాయని అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్​​ కుమార్​తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య కోఆర్డినేషన్ అంశాలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

8 ఏండ్ల నాటి అంశాలనూ అప్డేట్ చేయరా? 

2014లో లేవనెత్తిన అంశాలను కూడా ఈ–సమీక్ష పోర్టల్ అప్​డేట్ చేయకపోవడం ఏంటని కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.3,064 కోట్లు కావాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. వెనకబడిన జిల్లాలకు సంబంధించి రూ.450 కోట్లు ఇవ్వాలని కోరారు. ఐటీఐఆర్ తో పాటు ఎలక్ట్రానిక్​మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్స్, కొత్త ఎయిర్​పోర్టులు, ఐఐఎం ఏర్పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటివి కూడా ఉన్నాయి. వీటన్నింటిపై వివరాలు అప్​లోడ్ చేయాలని, దేని స్టేటస్​ఎక్కడ ఉందో అప్​డేట్ చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ సూచించారు.

ఒకవేళ ఏదైనా అంశాన్ని తిరస్కరించినట్లయితే.. ఆ విషయాన్ని కూడా పొందుపర్చాలన్నారు. మీటింగ్ ఉదయం10.30 గంటలకు మొదలు కాగా, సమయానికి సీఎస్ రాలేదని తెలిసింది. ఆయనకు బదులు జీఏడీ సెక్రటరీ శేషాద్రి అటెండ్ అయ్యారని, దీంతో కనీసం సీఎస్​కు టైంకు రావడం కూడా తెలియదా? అంటూ కేంద్ర కేబినెట్ సెక్రటరీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.