తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం : రాజ్నాథ్ సింగ్

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం : రాజ్నాథ్ సింగ్

ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పదేళ్ల నుంచి సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ ను దేశంలోనే ఒక మాడల్ గా అభివృద్ధి చేశామని, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టం.. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అటల్ బిహారీ వాజపేయి నుండి, మోదీ వరకు బీజేపీ ప్రభుత్వాల్లో పని చేసే నాయకులపై ఒక్క అవినీతి మచ్చలేదని అన్నారు. ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ తర్వాత మోసం చేసి పేపర్ లీకేజీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి... ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని చెప్పారు. 

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. 

మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోమంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతేలేదని ఆరోపించారు.