నదుల అనుసంధానానికి డీపీఆర్ రెడీ: రాష్ట్రాల అంగీకారమే..

నదుల అనుసంధానానికి డీపీఆర్ రెడీ: రాష్ట్రాల అంగీకారమే..

నదుల అనుసంధానానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలో పలు నదులను ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌‌) ముసాయిదాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, యూపీల్లో ప్రవహించే యుమునా నది ఉపనదులైన కెన్, బెత్వా నదుల అనుసంధానానికి పనులు మొదలయ్యాయని చెప్పారు. ఈ రెండు నదుల అనుసంధానానికి మొత్తం రూ.44,605 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, 2021–22లో రూ.4,300 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.1,400 కోట్ల ఇస్తునున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే 22.43 లక్షల ఎకరాలకు సాగు నీరు, 62 లక్షల మందికి తాగు నీరు అందునున్నట్లు వివరించారు. అలాగే 103 మెగా వాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.

మరో ఐదు ప్రాజెక్టులు..

దేశంలో మరో ఐదు రివర్ లింక్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దమన్‌గంగా–పింజల్, పార్–తాపి–నర్మద, గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌‌ డ్రాఫ్ట్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి లబ్ధి పొందే రాష్ట్రాలు పరస్పరం అంగీకారానికి వస్తే కేంద్రం సాయంతో వాటి పనులు మొదలవుతాయని నిర్మలమ్మ వివరించారు. అయితే ఈ ప్రాజెక్టుల్లో గోదావరి, కృష్ణా, పెన్నా నదులకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ సమ్మతి కీలకం కానుంది.