44 మంది జడ్జిల పేర్లను 3 రోజుల్లో క్లియర్ చేస్తం

44 మంది జడ్జిల పేర్లను 3 రోజుల్లో క్లియర్ చేస్తం

న్యూఢిల్లీ: కొలీజియం రికమండ్ చేసిన 44 మంది జడ్జిల పేర్లను రెండు మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జడ్జిల నియామకాల్లో జాప్యంపై దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ప్రతి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి. కానీ ఇప్పటికే ఉన్న చట్టాన్ని అనుసరించాలి. మీరు కొత్త వ్యవస్థను తీసుకురావాలనుకుంటే.. శాసన వ్యవస్థ ఆ పని చేయవచ్చు’’ అని చెప్పింది. దీంతో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి.. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ప్రాసెస్ చేసే విషయంలో సుప్రీంకోర్టు విధించిన టైమ్‌‌లైన్‌‌ను అనుసరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

‘‘హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫార్సుల్లో.. 44 పేర్లను ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. వాటిని ఈ వారాంతంలోనే సుప్రీంకోర్టుకు పంపుతాం” అని హామీ ఇచ్చారు. ఈ సమయంలో జస్టిస్ ఎస్‌‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు ఎలివేషన్ కోసం కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురి పేర్ల గురించి అడిగారు. ‘‘నాకు కొన్ని ఇన్‌‌పుట్‌‌లు అందాయి. అయితే వాటిపై నాకు కొంత అభిప్రాయ భేదం ఉండవచ్చు. విచారణను కొంతకాలం వాయిదా వేయగలరా?” అని కోర్టును అభ్యర్థించారు. దీంతో విచారణను ఫిబ్రవరి 3కు కోర్టు వాయిదా వేసింది