ఉప్పల్ సెగ్మెంట్​లో ప్రభాకర్​ను గెలిపించాలి : అమిత్ షా

ఉప్పల్ సెగ్మెంట్​లో ప్రభాకర్​ను గెలిపించాలి : అమిత్ షా

ఉప్పల్, వెలుగు : బీఆర్ఎస్ రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.  ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్​కు మద్దతుగా సోమవారం రాత్రి నాచారం. మల్లాపూర్ ఏరియాల్లో నిర్వహించిన రోడ్​షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..  రాష్టంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ఉచితంగా 4 గ్యాస్​ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ కల్పిస్తామన్నారు.

ఉప్పల్​లో మీకు అత్యంత సన్నిహితుడు..  మీ సమస్యలు, బాధల పరిష్కారం కోసం శ్రమించే ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని అమిత్ షా జనాలను కోరారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉప్పల్ వాసులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. తనను గెలిపిస్తే.. సెగ్మెంట్​లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని బాగు చేస్తానన్నారు.

ఇందుకోసం అవసరమైన రూ. వెయ్యి కోట్ల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి ఉప్పల్ రూపురేఖలు మార్చే బాధ్యత తనదని ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఉదయం చిలుకానగర్ డివిజన్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రభాకర్ పూజలు చేశారు. బీరప్ప గడ్డ, ప్రశాంత్ నగర్, బ్యాంక్ కాలనీల్లో  పాదయాత్ర చేపట్డారు.