మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా

మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా

బెంగళూరు:  దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకతోపాటు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శనివారం ఇండియాటుడే నిర్వహించిన ‘కర్నాటక రౌంట్ టేబుల్ 2023’ ప్రోగ్రాంలో అమిత్ షామాట్లాడారు. ‘‘కర్నాటక ఎన్నికలు దక్షిణాదిలోకి బీజేపీకి ఎంట్రీ పాయింట్ గా నిలుస్తాయి. దక్షిణ భారత ప్రజలు బీజేపీని, మోడీని కోరుకుంటున్నారు. కర్నాటక, తెలంగాణలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచే మేం దక్షిణాదిలోకి ఎంటర్ అవుతాం” అని అమిత్ షా అన్నారు.  కర్నాటకలో బీజేపీ పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని చెప్పారు. ప్రధాని మోడీ తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు సామాన్యుడికి ఎంతో ప్రయోజనం కలిగించాయన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని అన్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలూ కలిసిపోతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇల్లీగల్ ముస్లిం కోటాకు తాము ముగింపు పలికామన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ మార్పును అనుసరిస్తుందని, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వకపోవడం వెనక అదే స్ట్రాటజీ ఉందన్నారు.