పాక్​ అణుబాంబులకు కాంగ్రెస్​ భయపడ్తోంది: అమిత్​ షా

పాక్​ అణుబాంబులకు కాంగ్రెస్​ భయపడ్తోంది: అమిత్​ షా

కరకట్ (బిహార్​): పాకిస్తాన్ ​వద్ద అణుబాంబులున్నాయని కాంగ్రెస్​ భయపడుతోందని, పీవోకేను టచ్ చేయొద్దని భయపెడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికలు విదేశాల్లో వెకేషన్స్ ఎంజాయ్​ చేసే రాహుల్​గాంధీకి, ఆర్మీ జవాన్లతో దీపావళి జరుపుకునే మోదీకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన బిహార్​లోని ససారం, కరకట్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా అమిత్​ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణం చేసిన స్కామ్​స్టర్లు ఉన్నారని, 23 ఏండ్లలో పీఎంగా, సీఎంగా మోదీపై ఒక్క అవినీతి మరకకూడా లేదని చెప్పారు. రాహుల్ ​గాంధీలాగా మోదీ ఆగర్భ శ్రీమంతుడుకాదని, ఓ బీసీ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టారని, ఓ దశలో చాయ్​ కూడా అమ్మారని తెలిపారు. విపక్ష ఇండియా కూటమికి బలమైన నాయకత్వం, వారిలో సహకారభావం లేదని అన్నారు. ఆర్టికల్​ 370ని తమ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పీవోకే  తమదేనని గట్టిగా చెప్పగులుగుతున్నామని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్​ను ప్రపంచంలోనే మూడో 
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్​కు రాష్ట్ర హోదా కల్పిస్తాం

జమ్మూకాశ్మీర్​లో లోక్​సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై అమిత్​ షా ఆనందం వ్యక్తంచేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి మోదీ సర్కారు కాశ్మీర్​ విధానాన్ని  నిరూపించుకున్నదని చెప్పారు. ఇక్కడ సెప్టెంబర్​ 30 లోపు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎలక్షన్స్​ ముగిసిన వెంటే ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు.

మత ఆధారిత ప్రచారం నిర్వహించలేదు

ఈ ఎన్నికల్లో తాము మత ఆధారిత ప్రచారం నిర్వహించలేదని అమిత్ షా వెల్లడించారు. ముస్లింలకు రిజర్వేషన్లపై తాము అసత్యాలు ప్రచారం చేయలేదని, కర్నాటక, ఆంధ్రప్రదేశ్​లో జరిగిన దానినే ప్రస్తావించామని చెప్పారు. ఈసారి కచ్చితంగా 400 సీట్లు సాధించి, కేంద్రంలో మూడోసారి అధికారం చేపడుతామని ధీమా వ్యక్తంచేశారు. ఒడిశా, అరుణాచల్​ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మోదీనే తమ పార్టీకి రియల్​ లీడర్​ అని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో అన్నివర్గాలతో సంప్రదింపులు జరిపి, యూనిఫామ్ సివిల్​ కోడ్​ (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే, వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్​ను కూడా అమలయ్యేలా చూస్తామని వెల్లడించారు. రాబోయే రెండు, మూడేండ్లలో దేశంలో నక్సల్స్​ సమస్య పూర్తిగా సమసిపోతుందని అమిత్​ షా చెప్పారు.