ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్‌‌ పీఎస్‌‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్‌‌

ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్‌‌ పీఎస్‌‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్‌‌
  • చిన్నారులపై సైబర్‌‌ నేరాల కట్టడికి కొత్త చట్టాలు రావాలి
  • కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో చిన్నారులపై సైబర్‌‌ నేరాలు భారీగా పెరుగుతున్నాయని, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత చట్టాల్లోని లోపాలను సవరించి కొత్త నిబంధనలు తేవాలని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్‌‌ వర్మ పేర్కొన్నారు. క్రైమ్‌‌‌‌ ఇన్‌‌ ఇండియా-2024 నివేదిక ప్రకారం నమోదైన సైబర్‌‌ నేరాల్లో 89 శాతం బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌‌ (సీఎస్ఏఎం)కు సంబంధించినవేనని, బాధితుల్లో 98 శాతం మంది బాలికలేనని వెల్లడించారు.

పోక్సో కేసుల్లో 96.6 శాతం నిందితులు బాధితులకు ముందే పరిచయమున్నవారేనని తెలిపారు. దేశంలోని 800 జిల్లాలకు కేవలం 441 ప్రత్యేక సైబర్‌‌‌‌ పోలీస్‌‌స్టేషన్లే ఉన్నాయని, ప్రతి జిల్లాలో కనీసం ఒక పీఎస్‌‌ను తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ, డీప్‌‌ఫేక్‌‌తో సృష్టిస్తున్న నకిలీ లైంగిక చిత్రాలను కూడా సీఎస్ఏఎం పరిధిలోకి తేవాలని, సైబర్‌‌ బెదిరింపులు, సెక్స్‌‌టార్షన్‌‌లకు  చట్టపరమైన నిర్వచనాలు కల్పించాలని కోరారు.

జాతీయ పోర్టల్‌‌, హెల్ప్‌‌లైన్‌‌ ఏర్పాటు చేయాలి

ఎన్‌‌క్రిప్టెడ్‌‌ యాప్‌‌ల నుంచి ఆధారాల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, డిజిటల్ ప్లాట్‌‌ఫారమ్‌‌లకు కఠినమైన చట్టబద్ధ బాధ్యతలు విధించాలన్నారు. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు, ప్రాసిక్యూషన్ విభాగాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని ఫిర్యాదుల పోర్టళ్లను సమర్థవంతంగా అనుసంధానిస్తూ ఒకే జాతీయ సైబర్‌‌ పోర్టల్‌‌‌‌ను, వివిధ హెల్ప్‌‌లైన్లను సమన్వయం చేస్తూ ఉమ్మడి హెల్ప్‌‌లైన్‌‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నల్సా (నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) పథకాలకు సంబంధించిన తెలుగు ఎడిషన్‌‌ పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా ఎగ్జిక్యూటివ్‌‌ చైర్మన్‌‌ జస్టిస్‌‌ విక్రమ్‌‌ నాథ్‌‌ ఆవిష్కరించారు.