డబ్బు, టైమ్​ ఆదా .. ముందస్తు ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్

డబ్బు, టైమ్​ ఆదా .. ముందస్తు  ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ:  జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రభుత్వం చివరి గడువు రోజు వరకు ప్రజా సేవ చేయాలనే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల చర్చ అంతా మీడియా ఊహాగానాలేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​18-–22 వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాని నిర్ణయించడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాల్సింది పోయి అనవసర విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తే డబ్బు, టైమ్ ఆదా అవుతుందన్నారు. వాటిని ప్రజల సంక్షేమానికి వినియోగించొచ్చని చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో వన్​ నేషన్ వన్ ఎలక్షన్​ గురించి చెబుతున్నది. ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని వేసింది. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణన తీసుకోవాలన్న ఆలోచనతో కమిటీలో వారికి చోటు కల్పించాం. అయితే అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ చేరబోవట్లేదని ప్రకటించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ ఉంటుంది” అని అన్నారు.

పార్లమెంట్ టైమ్​ వేస్ట్ చేయడమే వారి టార్గెట్ 

‘‘ప్రజలకు పనికొచ్చే విషయాలపై మాట్లాడేందుకు వాళ్లు ముందుకురారు. పార్లమెంట్ సమావేశాల్లో వాళ్లు టైమ్​ఎలా వేస్ట్ చేశారో దేశం  చూసింది. గతంలో ఒకే దేశం.. ఒకే పన్ను విధానం జీఎస్టీని తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకించారు. ఇంతకుముందు ప్రభుత్వానికి రూ.90 వేల కోట్లు వచ్చేది కానీ ఇప్పుడు రూ. 1.60 లక్షల కోట్ల  ఆదాయం వస్తున్నది” అని ఠాకూర్ అన్నారు.