
- చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా? ముమ్మాటికీ ధిక్కరణే
- మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ఫైర్
- జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటే తప్పయితే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
- అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలెందుకు వివరించడం లేదు?
- కేసీఆర్‌ను అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై విచారణ చేస్తున్న చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా? అని మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని అవమానించేలా కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్‌కు కనీస గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన నర్సింహారెడ్డి.. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే.. వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదని శనివారం ఓ ప్రకటనలో సంజయ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టి.. ఓడించినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్.. తన వాదనలో పస ఉంటే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అనేక అక్రమాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన దృష్టికి వచ్చిన సమాచారం ఆధారంగా వివిధ రూపాల్లో క్రాస్ ఎగ్జామిషన్ చేస్తుందని, అందులో భాగంగా అంతర్గతంగా, బహిరంగంగా విచారణ చేసే అధికారం కమిషన్‌కు ఉందని, దీనిని తప్పుపట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. “ఈఆర్సీ నిర్ణయాలను జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అవినీతి, అక్రమాలపైనే కమిషన్ విచారణ జరుపుతున్నదే తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బద్నాం చేయడం సిగ్గు చేటు” అని సంజయ్ అన్నారు.
సీజేగా చేసిన వ్యక్తిని అవమానిస్తరా?
కేసీఆర్ తన లేఖలో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పేర్కొనడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు. నర్సింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే ఆనాడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్రానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగ పర్చాలని ఆదేశాలు జారీ చేసి.. ఆ కమిటీలోని 8వ చాప్టర్ అంశాలను బట్టబయలు చేయించిన ధైర్యశాలి అని గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తి చిత్తశుద్ధిని శంకించేలా కేసీఆర్ వ్యవహరించడం, చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వితండవాదం చేయడం విచారకరమని పేర్కొన్నారు. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్‌మీట్ నిర్వహించి.. న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు ఇదే తరహాలో కేసీఆర్ ఎదురుదాడి చేశారని అన్నారు. ‘కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా?’ అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారని సంజయ్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంతోపాటు కాళేశ్వరం, గొర్రెల పంపిణీ అక్రమాలపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్‌తోపాటు అప్పటి మంత్రులు, అధికారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే విషయంలో ఆధారాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌తో సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నిష్పాక్షికంగా విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ ను తప్పుకోవాలంటూ బెదిరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారందరినీ అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలని సంజయ్ కోరారు.
కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి
తక్షణమే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి.. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. “విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరి గాయనేది బహిరంగ రహస్యం. ఈ విష యంలో కేసీఆర్ తప్పు చేయలేదని భావిస్తే నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుపట్టడం, కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ నర్సింహా రెడ్డికి సూచించడం దారుణం. ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది” అని సంజయ్ పేర్కొన్నారు.