బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఇంకెన్నాళ్లు దోచిపెడతారు ? : కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఇంకెన్నాళ్లు దోచిపెడతారు ? : కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌
  • రూ.700 కోట్లు ఇచ్చారని నాపై నిందలేస్తే కనీసం ఖండించరా ? 
  • నేను ఎంపీగా గెలిస్తే ఒక్క బొకే అయినా ఇచ్చారా ?
  • గ్రానైట్‌‌‌‌ వ్యాపారులపై కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌ ఫైర్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : ‘బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వందల కోట్లు దోచి పెడుతున్నారు.. ఆ పార్టీని ఇంకా ఎన్నాళ్లు సాదుతరు.. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన మీకు రావడం లేదు’ అని గ్రానైట్‌‌‌‌ వ్యాపారులపై కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా మానకొండురు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం బండి సంజయ్‌‌‌‌ వచ్చారు. దీంతో గ్రానైట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ నాయకులు తిరుపతిగౌడ్‌‌‌‌తో పాటు మరికొందరు బండిని కలిశారు. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్‌‌‌‌ అసోసియేషన్ నేతలు బండి సంజయ్‌‌‌‌కి చెప్పారు. 

దీంతో స్పందించిన ఆయన ‘ మరి కనీసం ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా ? ఎందుకు చెప్పలేదు ? మీరంతా గత 20 ఏండ్లుగా బీఆర్ఎస్‌‌‌‌కు దోచిపెడుతూనే ఉన్నారు, కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నరు, మరికొందరు వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తరు, మాలోంటోళ్లను ఓడగొట్టాలని చూస్తరు’ అని మండిపడ్డారు. ‘నేను గెలిచిన తర్వాత మీలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి బొకే అయినా ఇచ్చారా ? ఒక్క స్వీట్‌‌‌‌ ముక్క అయినా తినిపించారా ? నాకు రూ. 700 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంటే అసోసియేషన్‌‌‌‌ తరఫున ఎందుకు ఖండించలేదు’ అని ప్రశ్నించారు. 

ఒక్కో గ్రానైట్‌‌‌‌ కటింగ్ మెషీన్‌‌‌‌ దుకాణం నుంచి సభ్యత్వం పేరుతో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బులను ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఆ లెక్కలన్నింటినీ త్వరలోనే బయటకు తెస్తానన్నారు. కేంద్ర మంత్రి సంజయ్‌‌‌‌ వ్యాఖ్యలతో ఖంగుతిన్న గ్రానైట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ నాయకులు సమాజానికి సేవ చేస్తామని, అందులో భాగంగానే గణేశ్‌‌‌‌ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.