
- రోడ్ల కోసమే రూ.లక్షన్నర కోట్లు ఇచ్చినం
- తెలంగాణకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం
- బతికుంటే పరిహారం...చనిపోతే సంతాపంతోనే సరిపెట్టడం సరికాదు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటూ పదేపదే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రోడ్లు, రైల్వేల అభివృద్ధే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇకనైనా విమర్శలు మానుకుని డెవలప్మెంట్కి సహకరించాలని కోరారు.
పాతబస్తీ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లో పస లేదు. నేషనల్హైవేల కోసమే ఇప్పటివరకు రూ.లక్షన్నర కోట్లు ఇచ్చినం. రైల్వేల అభివృద్ధికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేశాం. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తిస్థాయిలో సహకరించడం లేదు.
విమర్శలకే పరిమితమవుతూ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటన మనసును కలిచివేసింది. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. బతికుంటే పరిహారం...చనిపోతే సంతాపంతోనే సరిపెట్టడం సరికాదు’ అని పేర్కొన్నారు.