
మాచారం: అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రారంభించారు. ఐదేండ్లలో రూ.12,600 కోట్లు ఖర్చు చేసి, ఆరు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి 2.10 లక్షల మంది చెంచులు, ఆదివాసీలు, గిరిజనులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆనాడు చెప్పానని, నిధులిచ్చే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ప్రతీ మూలకు నీరందాలని ఆకాంక్షించారు.
గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నామని, ఇందిరా సౌర గిరి జల పథకంతో మీ బతుకుల్లో మార్పు తెస్తామని సభకు హాజరైన గిరిజనులకు సీఎం రేవంత్ మాట ఇచ్చారు. ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా 6.69 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావడమే లక్ష్యమని సీఎం రేవంత్ చెప్పారు. పొలాల్లో సోలార్ పంపుసెట్లతో మీకు ఆదాయం వస్తుందని, సోలార్ విద్యుత్ మిగిలితే ప్రభుత్వానికి అమ్ముకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు వివరించారు. నియోజకవర్గంలో ప్రతి రైతుకు సోలార్ పంపు సెట్లు అందజేస్తామని, 100 రోజుల్లో అచ్చంపేటలో సోలార్ పంపుసెట్లు రైతులకు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు.
ALSO READ | నల్లమల డిక్లరేషన్ తప్పకుండా అమలు చేస్తాం:భట్టి విక్రమార్క
సోలార్ పంపుసెట్లలో అచ్చంపేటను దేశానికే ఆదర్శంగా మారుస్తామని సీఎం చెప్పారు. చెంచులందరికీ 10 రోజుల్లో ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసరాల ధరలు తగ్గించడంలో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్రం చెప్పిందని, శాంతి భద్రతల్లో కూడా మనమే నంబర్ వన్‌లోనే ఉన్నామని సీఎం హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని -సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆడ బిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను చేశామని, రాబోయే రోజుల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతొ పనిచేద్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.