- ఎన్డీఆర్ఎఫ్ త్యాగాలు మరువం
- ఎలాంటి విపత్తులైన ధైర్యంగా ఎదుర్కోగల సత్తా ఉంది
- ఎన్డీఆర్ఎఫ్ అమరుల సంస్మరణ సభకు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) వెన్నెముక వంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు, పర్వత రక్షణ చర్యలు, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) వంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ సిద్ధమైందని చెప్పారు. ఢిల్లీలో ఎన్డీఆర్ఎఫ్ అమరవీరుల సంస్మరణ సభకు బండి సంజయ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ప్రజలను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది త్యాగాలు దేశం ఎన్నటికీ మరువదన్నారు.
దేశంలో ప్రతి చోటా సహాయక చర్యలు
ఈ స్మారక చిహ్నం.. కేవలం రాతి నిర్మాణం కాదని.. ఎన్డీఆర్ఎఫ్ సైనిక దళాలు, రాష్ట్ర పోలీస్ బలగాల వీరత్వం, నిబద్ధతకు ప్రతీక అని సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా 16 బెటాలియన్లు, 28 రీజినల్ రెస్పాన్స్ సెంటర్లు (ఆర్ఆర్సీ) ద్వారా ఈ దళం ప్రతిచోటా సహాయక చర్యలు అందిస్తున్నదన్నారు. ‘‘ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటే చాలు.. పరిస్థితి అదుపులోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. తాజాగా మయన్మార్‌లో భూకంపం వస్తే.. “ఆపరేషన్ బ్రహ్మ”పేరిట ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న వర్షాలు, వరదలు వంటి విపత్తుల్లో అసాధారణ సేవలందించింది’’అని బండి సంజయ్ అన్నారు.
