
- ఈ విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటం: కేంద్ర మంత్రి బండి సంజయ్
- సీఎం రేవంత్ రెడ్డి మన వాదనలను గట్టిగా వినిపించాలి
- ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయబోమని కేంద్రం హామీ ఇచ్చింది
- బీసీ రిజర్వేషన్లతో ముస్లింలకే లబ్ధి.. బీసీ జాబితా నుంచి
- ముస్లింలను తొలగించాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.
ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయబోమని కేంద్రం హామీ ఇచ్చింది. తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం. ఆ అన్యాయాన్ని అడ్డుకుంటాం” అని చెప్పారు. గవర్నమెంట్స్కూళ్లలో టెన్త్చదువుతున్న 700 మంది స్టూడెంట్లకు మంగళవారం సిరిసిల్లలో సంజయ్ సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటామని చెప్పారు.
‘‘బనకచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మద్దతిస్తాం. ఈ వ్యవహారంపై రాష్ట్రానికి అండగా ఉంటాం. రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే సమావేశంలో ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు జరగనున్న నష్టంపై గట్టిగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కుట్ర..
బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని సంజయ్ ఆరోపించారు. ‘‘వైఎస్ హయాంలో ముస్లింలను బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ టైమ్‌లోనే బీసీ సంఘాలు అడ్డుకుని ఉంటే బీసీలకు అన్యాయం జరిగేది కాదు. ఈ రిజర్వేషన్లతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది.
ఇప్పుడు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామనడం దారుణం. రాష్ట్రంలో బీసీ జనాభా 51 శాతం ఉందని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి, బీసీ జనాభాను 46 శాతానికి తగ్గించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందులో 10 శాతం ముస్లింలకు ఇవ్వడం వల్ల, బీసీలకు దక్కే రిజర్వేషన్లు 32 శాతమే.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. దీనివల్ల బీసీలకు అన్యాయమే జరుగుతున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ముస్లింలు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 12 శాతం కాగా, 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమంటే వంద శాతం రిజర్వేషన్లు కల్పించడమే. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.
అయినా ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి. బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం తెలిపేలా చూస్తాం. ముస్లింలను తొలగించకుంటే ఊరుకోం” అని అన్నారు.
ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ..
తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, సొంతంగా సైకిల్ కూడా ఉండేది కాదని, సైకిల్ కిరాయికి తెచ్చుకుని తొక్కేవాడినని సంజయ్చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారేనని, వారికి తన లాంటి బాధ ఉండొద్దనే సైకిళ్లను పంపిణీ చేస్తున్నానని తెలిపారు.
ఎంపీగా ఉన్నంత కాలం ఏటా టెన్త్ స్టూడెంట్లకు సైకిళ్లను పంపిణీ చేస్తానని వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ‘మోదీ కిట్స్’ పేరుతో బ్యాగు, వాటర్ బాటిల్, పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ అందజేస్తానని తెలిపారు.
హైకోర్టులో ఊరట
బండి సంజయ్‌పై గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. 2023, నవంబర్ 30న మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ ఆనాటి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టేయాలంటూ సంజయ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అనుమతిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు చెప్పారు. పోలీసులు సాక్ష్యాల సమర్పణలో విఫలమయ్యారని, సంజయ్‌పై కేసు చట్టవిరుద్ధమని తీర్పులో పేర్కొన్నారు.