బిడ్డ అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? : కిషన్​రెడ్డి

బిడ్డ అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? : కిషన్​రెడ్డి
  • కేజ్రీవాల్‌‌ను అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి 
  • అవినీతిపరులను అరెస్ట్ చేస్తే ‘బ్లాక్ డే’నా?
  • ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టు చేశారని కామెంట్​
  • ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అర్వింద్​ కేజ్రీవాల్‌‌ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సొంత కూతురు కవిత‌‌ను అదుపులోకి తీసుకుంటే ఎందుకు స్పందించలేదని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేజ్రీవాల్‌‌ను అరెస్ట్ చెస్తే ‘బ్లాక్ డే’ ఎలా అవుతుందని, ఇలా అనడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నదని దుయ్యబట్టారు. 

శనివారం హైదరాబాద్​లోని  బీజేపీ ఆఫీస్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రులు, వాళ్లు ఫ్యామిలీ మెంబర్లే  నేరుగా లిక్కర్ స్కామ్ లో ఉండి వేల కోట్లు కొల్లగొట్టారని, కేసీఆర్​ చెప్పినట్టే ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజేనని అన్నారు. ఈ స్కామ్​లో బీఆర్ఎస్ పార్టీకి గానీ, ఆయన కుటుంబానికి గానీ సంబంధం లేదని చెప్పే దమ్ము కేసీఆర్‌‌ ఉందా? అని ప్రశ్నించారు. 

లిక్కర్​ స్కామ్‌‌లో ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలిందన్నారు. లిక్కర్ స్కామ్‌‌లో కవిత, కేజ్రీవాల్​ ప్రమేయముందని ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టు చేశారని, అవినీతి, కుంభకోణాలు చేసిన వారిని విడిచి పెట్టాలని కేసీఆర్​ చెబుతున్నారా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ స్పందించడం వెనుక ఆంతర్యమేంటన్నారు. 

సీబీఐ, ఈడీ దర్యాప్తుతో కేంద్రానికేం సంబంధం?

‘కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలి. కవిత అరెస్ట్‌‌తో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. లిక్కర్ పాలసీని మార్చినందుకు ఆప్ కు నిధులు  సమకూరాయి. కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ చేస్తున్న అవాస్తవ ప్రచారాలను ఖండిస్తున్నాం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణలో దోచుకున్నట్లే  ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కవిత అరెస్ట్‌‌తో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాదన్నారు. కవితను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ  లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరగడం లేదన్నారు. సీబీఐ, ఈడీ చేసే దర్యాప్తులకు కేంద్రంతో ఎటువంటి సంబంధం ఉండదని, అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ పదే పదే  విమర్శలు చేస్తున్నాయన్నారు.

కేసీఆర్ పాలనలో ఏరులై పారిన మద్యం

కేసీఆర్ పదేళ్ల పాలనలో మద్యాన్ని ఏరులై పారించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మద్యం వ్యాపారంలో వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నదన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.4 వేల కోట్లు ఉండేదని, 2023లో అది రూ.44 వేల కోట్లకు పెరిగిందన్నారు.

రేవంత్​ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడట్లే?

తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని కేసీఆర్ గతంలో చెప్పారని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ విధానాన్ని ఆచరిస్తే.. కేజ్రీవాల్ అనుసరించారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని అడిగిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక  ఎందుకు సైలెంట్​గా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకే మజ్లిస్ మద్దతు తెలుపుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ 17 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.