
- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేస్ తీసుకొస్తున్నం
- నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రెండు, మూడు నెలల్లో ఏఐ సిటీకి భూమి పూజ: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రోడ్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్, వాటర్ వేస్ అన్నీ అత్యాధునిక స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి ముంబై, నాగ్‌పూర్, విజయవాడ, బెంగళూరు ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు అద్భుతమైన జాతీయ రహదారులతో ప్రయాణం సులభమైందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో ఆదివారం కిషన్ రెడ్డి మాట్లాడారు.
మోదీ నాయకత్వంలో తక్కువ కాలంలోనే జాతీయ రహదారుల అభివృద్ధి అత్యంత వేగవంతంగా సాగుతున్నదన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ద్వారా విజయవాడ, నాగ్‌పూర్ వంటి ప్రధాన నగరాలను అనుసంధానించే పనులు భూసేకరణ దశలో ఉన్నాయని, భూసేకరణ త్వరగా పూర్తయితే ఈ ప్రాజెక్టులు త్వరలోనే వాస్తవ రూపం దాలుస్తాయని చెప్పారు. ‘‘మన లక్ష్యం స్పష్టంగా ఉంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం. దేశం స్వాతంత్ర్యం వందేండ్లు పూర్తి చేసుకునే సమయానికి, ఎవరు ప్రధానిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలి అన్నదే ప్రధాని మోదీ లక్ష్యం” అని తెలిపారు.
మోదీ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నదన్నారు. భారతదేశం ఫోర్త్-లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిందని తెలిపారు. ‘‘దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం రియల్ ఎస్టేట్ సెక్టార్. ఆధునిక వసతులు, హంగులతో కూడిన అద్భుత హౌసింగ్ సదుపాయాలు ఇప్పుడు ప్రతి నగరంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది” అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ రంగానికి అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు
2024–-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని.. 11.97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్ లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4,804 కోట్ల విలువైన 6,612 ఇండ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
ఇది 35 శాతం అధికం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదైంది. ఇవి కేవలం గణాంకాలు కాదు... రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాలు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం” అని తెలిపారు. కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు విజయసాయి మేక, కాళీ ప్రసాద్ దామెర, డా.లయన్ కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.