కాళేశ్వరం కోసం తెలంగాణ అప్పు రూ.86కోట్లు

కాళేశ్వరం కోసం తెలంగాణ అప్పు రూ.86కోట్లు
  •     ఇప్పటి దాకా చేసిన ఖర్చు రూ.81,321 కోట్లు
  •     ప్రాజెక్టు పనులు 83 శాతం పూర్తి
  •     ఎక్కువ ప్యాకేజీలు మేఘాకే దక్కాయి
  •     లోక్‌సభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

హైదరాబాద్‌, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం రాష్ట్ర సర్కార్​రూ.86 వేల కోట్ల అప్పులు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ 2018 జూన్‌లో ఓకే చెప్పిందన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకు ప్రాజెక్టు పనులు 83.7 శాతం పూర్తయ్యాయని, ఇప్పటి దాకా ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,321.57 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. కాళేశ్వరం నుంచి ఏటా 240 టీఎంసీలు ఎత్తిపోసి 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇస్తారని, 18,82,970 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారని వివరించారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తారని పేర్కొన్నారు.

రూ.59,53.51 కోట్లు రిలీజ్​
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.86,064.01 కోట్ల అప్పు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్​అనుమతి ఇచ్చిందని తెలిపారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కన్సార్షియం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కన్సార్షియం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, నాబార్డ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ల నుంచి ప్రభుత్వం అప్పులు తీసుకుందని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌ చేసుకున్న మొత్తంలో రూ.59,539.51 కోట్ల లోన్‌ రిలీజ్‌ చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 2015–16 ప్రైస్‌ లెవల్‌లో కేంద్ర ఇరిగేషన్‌, ఫ్లడ్‌ కంట్రోల్‌ అండ్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్ట్స్‌ అడ్వైజరీ కమిటీ రూ.80,190.46 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో కొత్తగా చేర్చిన కాంపోనెంట్ల వివరాలు మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్​ఇవ్వలేదని తెలిపారు. ప్రాజెక్టు కట్టేందుకు రూపాయి ఖర్చు చేస్తే రూ.1.51 ఆదాయం వస్తుందని అంచనా వేశారని వివరించారు.

14 ప్యాకేజీలు మేఘాకే
కాళేశ్వరంలో ఎక్కువ ప్యాకేజీల పనులు మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లిమిటెడ్‌ సంస్థకే ఇచ్చారని కేంద్ర మంత్రి చెప్పారు. మొత్తం 28 ప్యాకేజీల్లో 14 ప్యాకేజీలు ఈ ఒక్క సంస్థనే దక్కించుకుంది. వీటిలో కొన్ని ప్యాకేజీలను ఇతర సంస్థలతో కలిసి జాయింట్‌ వెంచర్‌గా దక్కించుకుంది. అడిషనల్ టీఎంసీ కోసం 11 ప్యాకేజీలుగా పనులు చేపట్టగా ఇందులో ఆరు ప్యాకేజీలను మేఘానే సొంతం చేసుకుంది. ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌ విజేత, నవయుగ, ఎన్‌సీసీ, మేటాస్‌, ఎంఆర్‌కేఆర్‌, ష్యూ, మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా, రాఘవ, గాయత్రి, సత్యసాయి, రాజరాజేశ్వర, జీవీఆర్‌, కావేరి, సిద్ధార్థ, శంకరనారాయణ, బృంద, పీఎల్‌ఆర్‌, గామన్‌, సరళ, పటేల్‌ కంపెనీ, ప్రతిమ, కేఎన్‌ఆర్‌ సంస్థలు సొంతగా, లేదా జాయింట్‌ వెంచర్‌గా మిగతా ప్యాకేజీల పనులు చేస్తున్నాయని పేర్కొన్నారు.