
- స్వాతంత్ర్య వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో కొంత మంది దేశహితాన్ని విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని, ఇందుకు వ్యతిరేకంగా ఇండియాను విశ్వగురుగా మార్చేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వేల మంది బలిదానంతో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం.
వారందరి త్యాగ ఫలంతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా నిలిచిన భారత్.. ప్రస్తుతం వికసిత్ భారత్ నిర్మాణం దిశగా పయనిస్తుంది. ఈ ఆత్మనిర్భర భారత నిర్మాణంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా మనమంతా ఐక్యంగా ముందుకుసాగాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని తగ్గించడం తదితర అంశాల్లో ప్రధాని మోదీ వెంట నిలుద్దాం’’అని ఆయన పేర్కొన్నారు.