
- మీ పార్టీకి చౌకగా హైదరాబాద్లో పదెకరాలు కేటాయించలేదా?
- అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతివ్వలేదా?
- ఇద్దరు కలిసి యూసీసీని వ్యతిరేకిస్తున్నది వాస్తవం కాదా?
- మీ పార్టీకి చౌకగా హైదరాబాద్లో
- పదెకరాలు కేటాయించింది నిజం కాదా?
- పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతివ్వలేదా?
- ఇద్దరు కలిసి యూసీసీని వ్యతిరేకిస్తున్నది వాస్తవం కాదా?
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ నీతివంతమైన పార్టీనే అయితే.., ఆ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య దోస్తీ లేదనే విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే నిరూపించగలరా అని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ఖర్గేకు తను వేసే ఎనిమిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ కు హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున కట్టబెట్టింది వాస్తవం కాదా.. దీని వెనక ఎలాంటి డీల్ లేదని ఖర్గే చెప్పగలరా?
- బీజేపీని ఓడించడానికి.. సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించడం.. మీ రెండు పార్టీల మధ్యనున్న అవగాహనకు ఉదాహరణ కాదా?
- కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లో చేరినప్పటికీ.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణమేంటి?
- కాంగ్రెస్పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలపడం, ఆ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో కేసీఆర్ ముందుండి నడపడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తీకి ఇది ఉదాహరణ కాదా ?
- శాసనమండలిలో కాంగ్రెస్ ను పూర్తిగా బీఆర్ఎస్ లో విలీనం చేసేసినప్పుడు దీనిమీద స్పందించకపోవడం మీపార్టీల మధ్య సయోధ్యను స్పష్టం చేస్తున్నది నిజం కాదా?
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మతతత్వ మజ్లిస్ సయోధ్య కుదుర్చుతోంది. అందుకే మీరంతా కలిసి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా?
- ఇటీవలి లోక్‌సభ సమావేశాలలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదా?
- కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులుగా అధికారాన్ని అనుభవించలేదా.. అప్పటినుంచే మీస్నేహం కొనసాగుతున్నది నిజం కాదా అని అడిగారు.
తన ఈ ప్రశ్నలకు మల్లికార్జున ఖర్గే సమాధానం ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గాలి కబుర్లతో చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలను మానుకోవాలన్నారు. ఈ ప్రశ్నలకు మల్లికార్జున ఖర్గే సమాధానం ఇవ్వలేకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్..- బీఆర్ఎస్ పొత్తుందని మరోసారి రాష్ట్ర ప్రజలకు ధ్రువీకరించినట్లే అవుతుందన్నారు. ఇటీవలే కాంగ్రెస్.. -బీఆర్ఎస్ నాయకులు కలిసి వేదికను పంచుకున్న సందర్భంలో ఖర్గేతో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా కిషన్ రెడ్డి మీడియాకు రిలీజ్చేశారు.