
పద్మారావునగర్, వెలుగు: దేశంలో సనాతన ధర్మం ఎంతో గొప్పదని, దానిని పరిరక్షించడం ప్రతి ఒక్క హిందువు బాధ్యత అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో హిందుత్వం ఉన్నంత కాలమే సెక్యులరిజం ఉంటుందన్నారు. హిందూ మతం మైనారిటీలో పడితే సెక్యులరిజం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ మతం గురించి మాట్లాడితే ఇతర మతాలను కించపరిచినట్లు కాదన్నారు.
హైదరాబాద్ పద్మారావునగర్‌లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన తెలంగాణ వేద విద్వాన మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేల ఏండ్లుగా భారతదేశ గడ్డమీద సనాతన ధర్మం, హిందూ మతం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా సభలో పాల్గొన్న వేద పండితులను ఆయన సత్కరించారు.