పార్టీ ఫిరాయింపులకు మాస్టర్ కేసీఆర్ : కిషన్ రెడ్డి

పార్టీ ఫిరాయింపులకు మాస్టర్ కేసీఆర్ : కిషన్ రెడ్డి
  • ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ లాగా మా దగ్గర అవినీతి డబ్బు లేదు 
  • ఆయన వేసే డ్రామాలు, సినిమాలకు భయపడం 
  • పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ పైనే కేసులు పెట్టాలని డిమాండ్ 

న్యూఢిల్లీ, వెలుగు : దేశంలో, రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ సీఎం కేసీఆరే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చుకొని, వాళ్లను మంత్రులను చేసిన నీచ సంస్కృతి టీఆర్ఎస్ దే అని మండిపడ్డారు. ‘‘గతంలో బీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచినోళ్లను కారెక్కించుకొని తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేశారు. తర్వాత12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని, వాళ్లు రాజీనామా చేయకున్నా మంత్రులుగా కొనసాగిస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల్లో మొదటి దోషి కేసీఆరే అని, ఆయనపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్​లో ప్రముఖ ఆర్టిస్ట్ అక్బర్ సాహెబ్ ప్రధాని మోడీ పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ సర్కార్​ను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ కట్టుకథలు చెబుతున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు వస్తే టీఆర్ఎస్ సర్కార్ కూలిపోతుందా? బీజేపీ సర్కార్ ఏర్పడుతుందా?” అని ప్రశ్నించారు.  

కేసీఆర్ సినిమా సక్సెస్ కాలేదు.. 
టీఆర్ఎస్ లాగా రాజీనామా చేయని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తాము చేర్చుకోమని కిషన్ రెడ్డి చెప్పారు. రాజీనామా చేసి వచ్చేటోళ్లను బాజాప్తా చేర్చుకుంటామని తెలిపారు. అసలు బీజేపీలో చేరడమే నేరమన్నట్లు టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. ‘‘వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. అంత డబ్బు పెట్టి కొనుగోలు చేసేందుకు కేసీఆర్ లాగా మా దగ్గర అవినీతి సొమ్ము లేదు.

ప్రాజెక్టుల్లో, భూముల డీలింగ్స్ లో కమీషన్లు కొట్టేసే ప్రభుత్వం, పార్టీ మాది కాదు” అని అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రూ.400 కోట్ల విలువ చేసేంత వారు కాదని విమర్శించారు. ‘‘గతంలో కేసీఆర్ వేసిన కొన్ని నాటకాలు, చేసిన డ్రామాలు, తీసిన హర్రర్, జానపద సినిమాలు సక్సెస్ అయి ఉండొచ్చు. ఈసారి ఎమ్మెల్యేల కొనుగోళ్ల పేరుతో సినిమా తీయబోయారు. దాని ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారు. కానీ అది సక్సెస్ కాలేదు” అని అన్నారు. 

పాకిస్తాన్​లో ప్రెస్ మీట్ పెట్టినా ఓకే... 
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని, ఇప్పుడు మునుగోడులోనూ ఓడిపోతుందని.. అందుకే ఓటమి భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ డ్రామాలు, సినిమాలకు భయపడబోమన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించి, బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో కాదు.. పాకిస్తాన్​లోని లాహోర్ లో ప్రెస్ మీట్ పెట్టినా మాకేం కాదు. అవసరమైతే అమెరికాలో కూడా పెట్టుకో” అని కేసీఆర్ కు సూచించారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇదంతా కుట్ర అని, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘నందకుమార్ నా అనుచరుడు కాదు.

ప్రస్తుతం టీఆర్ఎస్ తో ఉంటున్నారు. సంతోష్ కు బాగా దగ్గర అని’’ చెప్పారు. స్వామీజీలు ఎవరో? ఎందుకు వచ్చారో? బయటకు రావాల్సి ఉందన్నారు. స్వామీజీ, ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణలో ఎక్కడ కూడా డబ్బుల ప్రస్తావన లేదని.. అసలు ఆ స్వామీజీతో బీజేపీకి సంబంధం లేదన్నారు. మునుగోడు ఎన్నిక ఆపాలని తాము చెప్పలేదని, అది ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు.