తెలంగాణ చరిత్రను దాచిపెట్టిన్రు.. 

తెలంగాణ చరిత్రను దాచిపెట్టిన్రు.. 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం ప్రజల పండుగ అని, హర్ ఘర్ తిరంగా తరహాలో సెప్టెంబర్ 17న రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకొందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్​లో జరిగే వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారని, కేంద్ర బలగాలు కవాతు నిర్వహిస్తాయని తెలిపారు. సోమవారం హైదరాబాద్​లోని పీఐబీ ఆఫీసులో ఆయన మీడియా తో మాట్లాడారు. మహారాష్ట్ర, కర్నాటకలో ఇదివరకే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలోనూ విమోచన దినోత్సవాన్ని ప్రజా పండుగలా జరుపుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని బురుజులకు కొత్త రంగులు వేసి జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు జరిగే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కేంద్ర అధికారులను ఆదేశించారు. ఈ నెల10 నుంచే తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రత్యేక కథనాలను అందించాలని మీడియా సంస్థలను కోరారు. 

తెలంగాణ చరిత్రను ఇక్కడి ప్రభుత్వాలు 74 ఏండ్లుగా కప్పిపెట్టాయని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘ఇండియన్ యూనియన్​లో కలిసేందుకు హైదరాబాద్ సంస్థానం ప్రజలు రజాకార్ల దాడులను ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేశారు. రజాకార్ల అఘాయిత్యాలకు తట్టుకోలేక మహిళలు సామూహిక ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. సర్దార్ పటేల్ ఇండియన్ ఆర్మీతో యుద్ధానికి దిగడంతో నిజాం రాజు లొంగిపోయాడు” అని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు మజ్లిస్ ఒత్తిళ్లకు లొంగిపోయి సెప్టెంబర్ 17 వేడుకలను అధికారికంగా నిర్వహించలేదన్నారు. తెలంగాణలో తొలిసారిగా 1948, సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ జాతీయ జెండా ఎగురవేశారని, మళ్లీ 74 ఏండ్ల తర్వాత సెప్టెంబర్ 17న అధికారికంగా జాతీయ జెండా ఎగరబోతోందన్నారు.