మోడీపై కేటీఆర్ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

మోడీపై కేటీఆర్ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

న్యూఢిల్లీ, వెలుగు: అర్థం లేని అబద్ధాలను సృష్టించడం, విచ్చలవిడి అవినీతిలో నోబెల్ బహుమతి తీసుకునే అర్హత ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్​కు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరోనా టీకా విషయంలో మోడీ చేసిన కృషి ఏంటో యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. ‘‘కరోనా ట్రీట్​మెంట్​కు పారాసిటమాల్ సరిపోతుందన్నందుకు వైద్యరంగంలో కేసీఆర్​కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. 80 వేల పుస్తకాలు చదివినందుకు సాహిత్యంలో నోబెల్ ఇవ్వాలి’’ అని కిషన్ రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. 

మునుగోడులో గెలుపుకోసం తొండాట

మునుగోడు ప్రజల్లో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందని, అందుకే ఎన్నికలో గెలుపుకోసం ఆ పార్టీ తొండాట ఆడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఊరికొక ఎమ్మెల్యేను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. అంగట్లో గొర్రెలను కొన్నట్టు సర్పంచ్​లకు, ఓటర్లకు డబ్బులిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలతో తిరిగే లీడర్లను రాష్ట్ర మంత్రులు బెదిరిస్తున్నారని, విహార యాత్రలకు పోయేందుకు ఖర్చులు పెట్టుకుంటామని చెప్పి ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులే గ్రామాల్లో తిష్టవేసి నేరుగా ఓటర్లకు లిక్కర్, చికెన్, మటన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు దుబ్బాక, హుజూరాబాద్​లో టీఆర్ఎస్​ను ఓడించారని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపిస్తారని అన్నారు.  అంతకుముందు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయిన కిషన్ రెడ్డి.. తెలంగాణ, ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. 

జాగలియ్యకనే రైల్వే ప్రాజెక్టులు ఆగినయ్ ..

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని కిషన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతోనే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తికావట్లేదని, ఎంఎంటీఎస్ -II ప్రాజెక్టు అంచనాలు రూ. 301 కోట్లు పెరిగాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో కేంద్రం తన వాటా మొత్తాన్ని రిలీజ్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.545 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. రూ. 180 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందన్నారు. దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసినా, రైల్వే బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసినా కేసీఆర్ సర్కారు నుంచి స్పందన లేదన్నారు. ప్రాజెక్టుల కోసం 350 హెక్టార్ల జాగా ఇవ్వని కారణంగా రూ.6,266 కోట్ల విలువైన 500 కిలోమీటర్ల మేర రైల్వే పనులు ఆగిపోయాయని వెల్లడించారు. కాజిపేట– -కాగజ్ నగర్ మధ్య అదనపు రైల్వే లైను, మనోహరాబాద్-– కొత్తగూడెం రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని రైల్వే మంత్రిని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

త్వరలో హైదరాబాద్ నుంచి వందే భారత్.. 

హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముందుగా హైదరాబాద్–-విశాఖపట్నం, హైదరాబాద్-– తిరుపతి, హైదరాబాద్-–బెంగళూరు రూట్లలో ఏదో ఒక మార్గంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.