బీజేపీ బలపడుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు

బీజేపీ బలపడుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు

సీఎం కేసీఆర్ నయా నిజాం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ ను హౌజ్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని..బీజేపీ బలపడటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బాష దారుణమన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కేసీఆర్ ను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కానీ కేసీఆర్ ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. 

ఉప ఎన్నికల్లో ఓడినా బుద్ది రావడం లేదు..
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను ఓడించినా బుద్దిరావడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ దళితబంధుతో ఓట్లను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ కేసీఆర్ అహంకారాన్ని  ప్రజలు ఓడించారని చెప్పారు.  కేసీఆర్ డబ్బు రాజకీయాలను ఓడించారన్నారు. తెలంగాణలో సూర్యుడు ఉదయిస్తాడు..కమలం వికసిస్తుందన్నారు. 

కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నారు..
తెలంగాణలో కేసీఆర్, కల్వకుంట్ల వ్యతిరేక వాతావరణం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బండి సంజయ్ దీక్ష చేస్తే కొంపలు మునిగినట్లు కిటికీల ఊచలు కట్ చేసి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీఆర్ఎస్ వచ్చాక పోలీసు వ్యవస్థనే భ్రష్టు పట్టించారని చెప్పారు.