యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే: కిషన్ రెడ్డి

యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే: కిషన్ రెడ్డి
  • రామగుండం ఎఫ్​సీఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు : కిషన్ రెడ్డి
  • త్వర‌లో రాష్ట్రానికి 50 వేల ట‌న్నులు పంపుతం
  • కాంగ్రెస్ ఒత్తిడితో కాదు... బాధ్యతగా ఇస్తున్నం 
  • యూరియాతో కేటీఆర్‌‌కు ఏం సంబంధం? 
  • చిన్న పిల్లల ఆటలాడొద్దని మండిపాటు

న్యూఢిల్లీ, వెలుగు: యూరియా స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులున్న మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణకు యూరియా సరఫరా విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నది నిజమేనని అంగీకరిస్తున్నాను. ఈ విష‌యంలో అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాను. రామ‌గుండం ఎఫ్‌సీఐలో సాంకేతిక లోపం కార‌ణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి” అని చెప్పారు. త్వరలోనే రాష్ట్రానికి 50 వేల ట‌న్నుల యూరియా సరఫరా చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ధ‌ర్నాల‌తో యూరియా ఇవ్వడం లేద‌ని, కేంద్ర ప్రభుత్వంగా తమ బాధ్యతగా ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో కిష‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. యూరియా స‌ర‌ఫ‌రాలో అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఎదురైన‌ట్లు చెప్పారు.  అయినా, ఎప్పటికప్పుడు యూరియాను  అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామ‌‌న్నారు.‘‘కాంగ్రెస్ హయాంలో దేశంలోని యూరియా కంపెనీలను మూసేశారు. మేం వాటిని తెరిపించి ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం. అన్ని దేశాల్లో యూరియా ధరలు పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం ఒక్క రూపాయి ధర కూడా పెంచలేదు. ప్రతిసారీ సబ్సిడీని పెంచుతూ రైతులపై భారం పడకుండా చూస్తున్నాం. ఇది మా కమిట్‌‌మెంట్. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2 లక్షల ట‌‌న్నుల స్టాక్ ఉండే. అలాగే వేపపూత యూరియాను తీసుకొచ్చాం. అదేమైందో తెలియదు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవడంతో పాటు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. రైతులకు ఇవ్వడంలో మేం బాధ్యతగా వ్యవహరిస్తున్నాం”అని కిషన్​ రెడ్డి అన్నారు. యూరియాపై తెలంగాణ మంత్రులు అన‌‌వ‌‌స‌‌ర రాద్ధాంతం చేస్తున్నార‌‌ని మండిప‌‌డ్డారు. వారి వల్లే తెలంగాణ‌‌లో సమస్య ఉత్పన్నమైంద‌‌ని విమ‌‌ర్శించారు. పెద్ద రైతులు స్టోర్ చేశార‌‌ని, కొంద‌‌రు దారి మ‌‌ళ్లిస్తున్నార‌‌ని ఆరోపించారు. 

అడిగినంతా ఇచ్చాం...

11 ఏండ్లలో ఏనాడూ యూరియా కొరత ఏర్పడలేద‌‌ని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణకు 20 లక్షల టన్నుల యూరియా అవసరం ఉందని అడిగారు. ఇప్పటికే అడిగినంతా సప్లయ్ చేశాం. వర్షాలు బాగా కురిశాయి. రైతులు పంట వేశారు. అందుకోసం వారికి సహకరించాల్సిన బాధ్యత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. అందుకే మరో 2 లక్షల యూరియా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో దాదాపు 50 వేల టన్నులు త్వరలోనే ఇవ్వనున్నాం. కరైకల్ పోర్టులో యూరియా ఉంది. ఇందులో 10వేల టన్నులు, ఇఫ్కో నుంచి 15వేల టన్నులు. క్రిభ్ కో నుంచి 17,500 టన్నులు. రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి 7,500 టన్నులు తెలంగాణకు వస్తోంది. కేంద్రం కమిట్‌‌మెంట్ తో ఉంది కాబట్టే.. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా.. రైతులకు మేలు చేస్తున్నాం”అని అన్నారు. 

కేటీఆర్ ఎవరు? 

కేటీఆర్ ఎవ‌‌ర‌‌ని కిషన్​రెడ్డి  ప్రశ్నించారు. ‘‘కేటీఆర్ ఎవ‌‌రు? ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆయ‌‌న స‌‌పోర్టు మాకు అవ‌‌స‌‌రం లేదు. యూరియా ఇస్తే మ‌‌ద్దతు ఇస్తామ‌‌ని చిన్న పిల్లల ఆట‌‌లాడొద్దు. యూరియాకు, కేటీఆర్‌‌‌‌కు ఏం సంబంధం? యూరియా ఇస్తున్నది కేంద్రం.. తీసుకుంటున్నది రైతులు”అని అన్నారు. తెలుగు వాళ్లయిన జీఎంసీ బాల‌‌యోగి లోక్‌‌స‌‌భ స్పీక‌‌ర్‌‌‌‌గా, వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పోటీలో నిలిచిన‌‌ప్పుడు కాంగ్రెస్ మ‌‌ద్దతు ఇవ్వలేద‌‌న్నారు. ఆనాడు కాంగ్రెస్ నేత‌‌ల‌‌కు తెలుగు గౌరవం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో విలువలు కాపాడేందుకే సంస్కరణలు.. 

రాజ‌‌కీయాల్లో నైతిక విలువలను కాపాడేందుకే 130వ రాజ్యాంగ సవరణ చేసినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరారోపణలతో 30 రోజులు జైల్లో ఉన్నట్లయితే.. పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైనా పదవి నుంచి దిగిపోవాల్సిందేనని చెప్పారు. ఈ బిల్లుకు మద్దతుగా నిలవాల్సిన ప్రతిపక్షాలు.. వ్యతిరేకించడం దుర్మార్గమ‌‌న్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, త‌‌మిళ‌‌నాడుకు చెందిన మంత్రులు అరెస్ట్ అయినా.. ప‌‌ద‌‌వులు వ‌‌ద‌‌ల్లేద‌‌ని గుర్తు చేశారు. ప్రధాని పదవి కాపాడుకునేందుకు ఆనాడు ఇందిరా గాంధీ 39వ రాజ్యాంగ సవరణ చేశార‌‌ని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన తీరుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతోంద‌‌ని.. తుమ్మితే ఊడే మూడు రాష్ట్రాల్లో (తెలంగాణ‌‌, హిమాచ‌‌ల్ ప్రదేశ్, క‌‌ర్నాట‌‌క‌‌) ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామ‌‌న్నారు.