రాష్ట్రంలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభించాం: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభించాం: కిషన్ రెడ్డి

జనగామ జిల్లా : బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో ధనికులకే బ్యాంకులు ఉపయోగపడేవని.. ఇప్పుడు పేదలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినవారే.. ఇప్పుడు అభినందిస్తున్నారని అన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలే కాకుండా.. విద్యాబోధను కూడా డిజిటల్ రంగంలోకి తీసుకువస్తామని అన్నారు. ఇండియాలో డిజిటల్ విప్లవం వస్తుందని తెలిపారు. తెలంగాణలో మూడు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించామన్నారు. మొదటగా ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో ప్రారంభించామని చెప్పారు. జనగామలోని SBI బ్యాంక్ లో జ్యోతి ప్రజ్వలన చేసి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బ్యాంకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

రానున్న రోజుల్లో అన్ని బ్యాంకుల్లోనూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో ధనవంతులకే క్రెడిట్ కార్డు ఉండేదని, ఇప్పుడు పేదలందరూ క్రెడిట్ కార్డు వినియోగించుకుంటున్నారని అన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ కు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. రేషన్ కార్డు మాఫియాను అరికట్టి.. అర్హులైన నిరు పేదలకు రేషన్ కార్డులు అందించాలని కోరారు. డూప్లికేట్ LPG అకౌంట్లకు చెక్ పెట్టేందుకు డిజిటల్ బ్యాంకింగ్ ఎంతో సహకారం అందించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రూ.300 కోట్లను డిజిటల్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు. రూ.-50 కోట్ల అకౌంట్లను జన ధన్ అకౌంట్ల కింద ఓపెన్ చేశామన్నారు. రాష్ట్రంలో జనధన్ అకౌంట్లు కోటి ఉన్నాయన్నారు.