హామీ ఇచ్చినోళ్లే అమలు చేయాలి.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామంటే ఊరుకోం: కిషన్ రెడ్డి

హామీ ఇచ్చినోళ్లే అమలు చేయాలి.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామంటే ఊరుకోం: కిషన్ రెడ్డి
  • కామారెడ్డి డిక్లరేషన్​లోని అంశాల ఊసెత్తడం లేదు
  • గాంధీ కుటుంబాన్ని పొగడటానికే ఢిల్లీలో స‌భ‌ పెట్టారని విమర్శలు

న్యూఢిల్లీ, వెలుగు:  బీసీ రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే వాటిని అమలు చేయాలని  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. అది కాకుండా బట్టకాల్చి బీజేపీపై వేస్తామంటే ఊరుకోబోమని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ.. గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని  ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పోరుబాట ధర్నాపై బుధవారం కిషన్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు.. గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో సభ పెట్టుకున్నారనేది స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో.. 50 శాతానికంటే ఎక్కువ సమయం, రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని విమర్శించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీదే. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని ఆయన అన్నారు. 

చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా.. కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రకటించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. 18 నెలలుగా ఆ డిక్లరేషన్​లో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదన్నారు. బీసీల సంక్షేమానికి ఐదేండ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం ఇప్పటికే రూ.40వేల కోట్లు ఇవ్వాలి, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేద‌న్నారు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేడదని రజకులు, గౌడ్లు.. ఇలా ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్టనిలువునా మోసం చేశార‌ని ఆరోపించారు. అలాగే అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారని. ఆ తర్వాత దీనికి 10 శాతం ముస్లింలను చేర్చి.. బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ‘అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి.. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నరు’ అని విమ‌ర్శించారు. మోదీని రేవంత్ రెడ్డి విమర్శిస్తే.. అది ఆకాశం మీద ఉమ్మేయడమేన‌ని, మోదీ నేతృత్వంలో సుస్థిరమైన పాలన అందుతున్నద‌న్నారు. వచ్చే 30 ఏండ్ల వరకు కేంద్రంలో అధికారం గురించి ఆలోచించడం కాంగ్రెస్ మానుకోవడం ఉత్తమమన్నారు.