బీజేపీ, టీఆర్‌‌ఎస్‌‌ కలిసే ప్రసక్తే లేదు

బీజేపీ, టీఆర్‌‌ఎస్‌‌ కలిసే ప్రసక్తే లేదు
  • రాష్ట్రంలో 2023లో బీజేపీదే అధికారం
  • దళితులపై సీఎంకు ప్రేమ లేదు.. ఓట్ల కోసమే దళిత బంధు
  • తెలంగాణ రాజకీయ భాషలో మార్పుకు కేసీఆరే కారణం
  • నోటిఫికేషన్‌‌ వచ్చాక అందరం హుజూరాబాద్‌‌లో దిగుతం
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: బీజేపీ, టీఆర్‌‌ఎస్‌‌  ఏ స్థాయిలో కూడా కలిసే ప్రసక్తే లేదని, కచ్చితంగా రాజకీయపరమైన అంశాలపై తమ పోరాటాలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ  సీఎం అడిగినా ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌‌మెంట్  ఇస్తున్నారని, సీఎం కేసీఆర్​కు ప్రధాని మోడీ అపాయింట్​మెంట్​పై అర్థంలేని విమర్శలు మంచి సంప్రదాయంకాదన్నారు.  తెలంగాణ రాజకీయ భాషలో మార్పు రావడానికి కేసీఆరే కారణమని పేర్కొన్నారు. ఏండ్ల తరబడి సెక్రటేరియెట్‌‌‌‌కు రాని ఏకైక సీఎం కేసీఆర్ అని దుయ్యబట్టారు. ఓట్ల కోసమే దళిత బంధు స్కీం తెచ్చారని, కేసీఆర్‌‌‌‌కు దళితులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. శనివారం ఆయన ‘వీ6 వెలుగు’ ఇంటర్య్యూలో పలు విషయాలను వెల్లడించారు.  

రెండోసారి కేబినెట్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ అయ్యాక టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై దూకుడు పెంచారు.. ఈ మార్పు ఎందుకొచ్చింది?
నా మాటల్లో మార్పు లేదు. సమస్యలపై, ప్రభుత్వ ఫెయిల్యూర్స్​పై మాట్లాడుతున్న. ప్రజలకు సీఎం అందుబాటులో ఉంటలేరు. ఏండ్లుగా సెక్రటేరియట్‌‌‌‌కు రాకుండా పాలిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే. ఇలాంటి కుటుంబపాలన కోసమా తెలంగాణ తెచ్చుకున్నది? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు.

జనం ఎలాంటి మార్పు కోరుకుంటున్నరు..?
టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నియంత, కుటుంబ, అవినీతి పాలన పోవాలని కోరకుంటున్నరు. తెలంగాణ రాజకీయ భాషలో మార్పు రావడానికి కేసీఆరే కారణం. 

కేసీఆర్​కు ఢిల్లీలో అందరి అపాయింట్​మెంట్‌‌‌‌ ఇస్తున్నరు? ఢిల్లీలో దోస్తీలో.. గల్లీలో కుస్తీ అనే విమర్శలు వస్తున్నయ్?
ప్రధానిని సీఎం అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ అడిగితే ఇస్తరు. గతంలో కాంగ్రెస్‌‌‌‌ సీఎంలకు కూడా ఇచ్చిన్రు. దీనిపై మాట్లాడటం మంచి సంప్రదాయం కాదు.  బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏ స్థాయిలో కూడా కలిసే ప్రసక్తే లేదు. రాజకీయంగా మా పోరాటాలు కొనసాగుతయ్​?  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర నాయకత్వం ఆకాంక్షిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకుండా అడ్డుకుంటున్నరు. ఈ నెల 17న అమిత్‌‌‌‌ షా వస్తున్నరు. ఆయన అనేక విషయాలు మాట్లాడుతరు. 

కేసీఆర్‌‌‌‌ జైలుకెళ్లడం తప్పదని మీ వాళ్లంటున్నరు?
కేసీఆర్‌‌‌‌ జైలుకు వెళ్తాడో లేదో చెప్పలేను. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెడుతున్న డబ్బులు అడ్డదారుల్లో సంపాదించినవే అని అందరికీ తెలుసు.  ఆధారాలు ఉంటే స్టెప్‌‌‌‌ తీసుకుంటం. 

79 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌‌‌‌ అంటోంది?
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. రాహుల్‌‌‌‌ గాంధీనే రాజీనామా చేసి పక్కకు వెళ్లిపోయారు. కాంగ్రెస్‌‌‌‌ అనేది నిన్నటి పార్టీ. 

బండి సంజయ్‌‌‌‌ పాదయాత్ర ఎలా ఉంది?
పార్టీ స్టేట్​ చీఫ్​గా బండి సంజయ్‌‌‌‌ పాదయాత్ర చేయడం గొప్ప విషయం. రాష్ట్రంలో పార్టీ బలపడటానికి ఇదొక ఆయుధం.  నాకు, సంజయ్‌‌‌‌కు గ్యాప్‌‌‌‌ అనేది ఊహాగానాలే. 

హుజూరాబాద్‌‌‌‌పై బీజేపీ ఫోకస్‌‌‌‌ పెట్టడం లేదంటున్నరు?
నోటిఫికేషన్‌‌‌‌ వచ్చాక మొత్తం అక్కడే దిగుతాం. ఇప్పటికే నేను హుజూరాబాద్‌‌‌‌కు పోయొచ్చిన. బైపోల్‌‌‌‌ లేట్‌‌‌‌ చేయడానికే కేసీఆర్‌‌‌‌ ఢిల్లీ వెళ్లి కలిసొచ్చారని కాంగ్రెస్‌‌‌‌ వాళ్లు అంటున్నరు. ఇవన్నీ పనికిరాని ఆరోపణలు. 

దళిత బంధు స్కీంను ఎలా చూస్తరు.?
ఈ స్కీం మంచిదే. ఇలాంటి దాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నం. దీన్ని ఓట్ల కోసమే తీసుకొచ్చారు. దళితులపై సీఎం కేసీఆర్​కు  ఎలాంటి ప్రేమ లేదు.