ఎక్కడికి పోయినా డబుల్ ఇండ్ల గురించే ప్రశ్న: కిషన్ రెడ్డి

ఎక్కడికి పోయినా డబుల్ ఇండ్ల గురించే ప్రశ్న: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: తన నియోజకవర్గమైన సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆదివారం పర్యటించారు. అడ్డగుట్ట, తుకారాంగేట్, తార్నాక, లాలాపేట ఏరియాల్లో ఆయన పాదయాత్ర చేశారు. ప్రజలను కలిసి మాట్లాడుతూ వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను బస్తీ వాసులు మంత్రి దృష్టికి తెచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు డబుల్​బెడ్రూం ఇండ్ల ముచ్చటే ప్రస్తావిస్తున్నారని, ఎప్పుడో దరఖాస్తు చేసినా ఇంకా రావట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు.

ఇంకా ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారని, రాష్ట్ర సర్కారు చెప్పిన 24 గంటల మంచినీటి సరఫరా జరగట్లేదని అంటున్నారని తెలిపారు. నల్లాలో కలుషిత నీరు వస్తోందని, అవి తాగడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారని వివరించారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా రోడ్ల మీదే మురుగు పారుతోందని, దీనికి సంబంధించిన ఇబ్బందులు స్థానికులు తన దృష్టికి తెచ్చారని మంత్రి వెల్లడించారు. అంతకుముందు పలు కాలనీల సంక్షేమ సంఘాల నేతలను మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. శ్రీపురి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సత్యనగర్​లో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులిస్తామని చెప్పారు. లాలాపేట్ ఓపెన్ నాలా పక్కన రోడ్డు నిర్మాణానికి రైల్వే అధికారులతో మాట్లాడతామన్నారు. వినోభా నగర్​లో ఇప్పటికే ఎంపీ నిధుల ద్వారా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్​కు, పెండింగ్​లో ఉన్న ఇతర పనులకు నిధులిస్తానన్నారు. పలు నిర్వహణాపరమైన సమస్యలను స్థానికులు కేంద్ర మంత్రికి వివరించడంతో.. వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్​ను, జలమండలి అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఆయనతో పాటు మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర

‘‘ఈ పాదయాత్రలో స్థానిక అధికారులు కూడా నా వెంట వస్తున్నారు. వాళ్లు కూడా ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలు వింటున్నారు. అప్పటికిప్పుడు పరిష్కారమయ్యేవాటిపై అధికారులను ఆదేశిస్తున్నా. మిగతా సమస్యలపై సర్కారుతో మాట్లాడి పరిష్కారికి కృషి చేస్తా. ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా నా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకే ఈ పాదయాత్ర. అంతేగానీ ఇందులో ఎలాంటి రాజకీయ విషయం లేదు. ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచీ చేస్తున్నదే”అని కిషన్ రెడ్డి వివరించారు. పాదయాత్ర చేస్తుండగా.. టీవీలో ప్రసారం అవుతున్న ప్రధాని మోడీ మన్​కీ బాత్​ కార్యక్రమాన్ని లాలాపేటలోని ఓ కార్యకర్త ఇంట్లో కిషన్ రెడ్డి వీక్షించారు.