విరాళాలు లేకుండా పార్టీ నడుపుడెట్ల? : నితిన్  గడ్కరీ

విరాళాలు లేకుండా పార్టీ నడుపుడెట్ల? : నితిన్  గడ్కరీ
  •     ఎలక్టోరల్  బాండ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
  •     పారదర్శకత కోసమే బాండ్ల స్కీం తెచ్చామని వెల్లడి

అహ్మదాబాద్: విరాళాలు తీసుకోకుండా రాజకీయ పార్టీలు నడపడం సాధ్యంకాదని కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీ అన్నారు. మంచి ఉద్దేశంతోనే ఎలక్టోరల్  బాండ్ల పథకాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో శనివారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివంగత అరుణ్  జైట్లీ కేంద్రఆర్థిక మంత్రిగా ఉన్నపుడు ఎలక్టోరల్  బాండ్లపై చర్చలు జరిపారని, ఆ చర్చల్లో తాను కూడా పాల్గొన్నానని తెలిపారు.

ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదన్నారు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలే ఫండ్స్  ఇస్తాయని, కానీ, మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదని చెప్పారు. అందుకే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు నేరుగా నిధులు వచ్చేందుకే ఎలక్టోరల్ బాండ్ల పథకం తేవడం వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన వెల్లడించారు. పార్టీలకు నిధులు ఇచ్చే దాతల పేర్లు ఎందుకు బయట పెట్టరని మీడియా ప్రతినిధులు అడగగా.. పేర్లు వెల్లడిస్తే అధికార మార్పు జరిగినపుడు సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

‘‘ఒక మీడియా సంస్థ ఏదైనా ఈవెంట్  నిర్వహించాలంటే అందుకు ఎవరో ఒకరు స్పాన్సర్  చేయాలి. అలాగే రాజకీయ పార్టీలు నడపాలంటే నిధులు అవసరం. నిధులు లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాయి? పారదర్శకత తేవడానికే ఎలక్టోరల్  బాండ్ల వ్యవస్థ తెచ్చాం. అయితే, ఈ పథకంలో ఏమైనా లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు భావించి ఏదైనా ఆదేశాలు జారీచేస్తే, రాజకీయ పార్టీలన్నీ కూర్చుని ఆ దిశగా చర్చలు జరపాలి” అని గడ్కరీ చెప్పారు.