మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం : మంత్రి బండి సంజయ్

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం : మంత్రి బండి సంజయ్
  • 8 నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నం: బండి సంజయ్
  • నిర్భయ నిధి కింద రూ.2,840 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడి
  • విమెన్  సేఫ్టీపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష 

న్యూఢిల్లీ, వెలుగు: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  అన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు సహా దేశంలోని 8 నగరాల్లో సేఫ్  సిటీ ప్రాజెక్టు కింద మహిళల భద్రత కోసం పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద ఆయా రాష్ట్రాల్లో  33 వేల సీసీటీవీ కెమెరాలతో పాటు పింక్  టాయిలెట్లు, మహిళా పెట్రోల్  యూనిట్లు, కౌన్సెలింగ్  కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 

అందుకోసం నిర్భయ నిధి కింద రూ.2,840 కోట్లను ఖర్చు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చ్  నాటికి ఆ సౌకర్యాలన్నింటినీ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మహిళల భద్రతపై మంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో మహిళా భద్రతా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించామని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. హై -సెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.950 కోట్లను కేటాయించిందన్నారు. 

సీసీటీవీ కెమెరాలు, జామర్లు, స్కానర్లు వంటి అధునాతన సాంకేతికత సౌకర్యాలను ఆయా జైళ్లకు కల్పించడంతోపాటు ఖైదీల సంక్షేమ పథకం కింద ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ‘‘యాసిడ్  అటాక్  బాధితులకు రూ.1 లక్ష ప్రత్యేక సహాయం అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 14,653 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్​ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశాం. దాదాపు 13,006 మహిళా ఆఫీసర్లు ఆ డెస్క్ లను నడిపిస్తున్నారు” అని సంజయ్  తెలిపారు.