కేసీఆర్, కేటీఆర్ అబద్ధాల కంపెనీ నడుపుతున్నరు

కేసీఆర్, కేటీఆర్ అబద్ధాల కంపెనీ నడుపుతున్నరు
  • వారి రాజకీయ భవిష్యత్ ముగిసే టైమ్ వచ్చింది: ప్రహ్లాద్​జోషి
  • సింగరేణికి గనులిస్తే తిరిగి వెనక్కిచ్చారు

యాదాద్రి, వెలుగు: ‘‘తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ అబద్ధాల కంపెనీ నడుపుతూ, నిత్యం అబద్ధాలను సృష్టిస్తున్నరు. ఎప్పుడూ అబద్ధాలాడే వాళ్లను జూటా రావులని పిలవాలి” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన పార్లమెంటరీ కోర్​కమిటీ మీటింగ్​లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ సాగిస్తున్న అవినీతి, అబద్ధాలతో కూడిన కుటుంబ పాలనను నిర్మూలించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్ రాజకీయ భవిష్యత్, టీఆర్ఎస్ భవిష్యత్ ముగిసే కాలం అతిదగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2015లో తెలంగాణకు మూడు బొగ్గు బావులను కేటాయిస్తే రెండు బావులను తిరిగి ఇచ్చారని తెలిపారు. తాము సింగరేణి లాభదాయంగా ఉండాలని పారదర్శకంగా గ్లోబర్ టెండర్ విధానాన్ని అవలంభిస్తూ గనులను లీజుకు ఇస్తుంటే, కేసీఆర్ మాత్రం తన బినామీలకు నామినేషన్ పద్ధతిలో గనులను కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, జిట్టా బాలక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.