ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ అర్బన్, వెలుగు: దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో పారదర్శక పాలన సాగుతోందని కేంద్ర కోల్, మైనింగ్ శాఖ మంత్రి ప్రహ్లాద్​జోషి అన్నారు. గురువారం జనగామ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల మీటింగ్ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరై మాట్లాడారు. మోడీ విధానాల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ 11 నుంచి 5వ స్థానానికి చేరుకుందన్నారు. 5జీ స్ప్రెక్టమ్​తో విప్లవాత్మక మార్పులు రానున్నాయన్నారు.  మిగతా దేశాలతో పొలిస్తే సాంకేతిక అభివృద్ధిలో భారత్ దూసుకుపోతోందన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా కేంద్ర పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. నూతన ఓటర్లు మోడీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి పాపారావు, ఉడుగుల రమేశ్, సౌడ రమేశ్, శివరాజ్ యాదవ్, ప్రేమలతారెడ్డి, హరిశ్చంద్రగుప్త, బొట్ల శ్రీనివాస్, బేజాడి బీరప్ప ఉన్నారు.

రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు వేయాలి : వరంగల్‍ సీపీ తరుణ్‍జోషి

వరంగల్‍, వెలుగు: రోడ్లపై హెల్మెట్‍ పెట్టుకోకుంటే, ట్రిపుల్‍ రైడింగ్‍ చేస్తే ఫైన్లు రాయాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ తరుణ్‍జోషి ఆదేశించారు. గురువారం పోలీస్‍ కమిషనరేట్​లో ట్రాఫిక్‍ అండ్‍ రోడ్‍ యాక్సిడెంట్స్ కంట్రోల్‍పై సీపీ రివ్యూ నిర్వహించారు. ఇందులో ట్రాఫిక్‍, లా ఆండ్‍ ఆర్డర్‍ పోలీస్‍ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరుణ్‍జోషి మాట్లాడుతూ.. గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనరేట్‍ పరిధిలో ట్రాఫిక్‍ రూల్స్ పాటించనివారి సంఖ్య పెరుగుతోందన్నారు.

సెల్‍ఫోన్‍లో మాట్లాడుతూ డ్రైవింగ్‍ చేసేవారు, రిజిస్ట్రేషన్‍ నంబర్‍ లేనివారిపై ప్రత్యేక దృష్టి పెట్టి జరిమానాలు విధించాలన్నారు. చాలాచోట్ల రాంగ్‍రూట్‍లో వాహనాలు నడుపుతున్నారని.. అలాంటిచోట్ల సిబ్బంది స్పెషల్‍ డ్రైవ్‍ చేపట్టాలని ఆర్డర్‍ వేశారు. ట్రైసిటీ పరిధిలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రధాన కారణాలేంటో తెలుసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మెయిన్‍ రోడ్లపై భారీ వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు. లా అండ్‍ ఆర్డర్‍ ఆఫీసర్లు సైతం తమ పోలీస్‍ స్టేషన్ల పరిధిలో తనిఖీలు పెంచాలన్నారు. సమావేశంలో సెంట్రల్‍ జోన్‍ డీసీపీ అశోక్‍ కుమార్‍, ట్రాఫిక్‍ అడిషనల్‍ డీసీపీ పుష్పారెడ్డి, ఏసీపీలు మధుసూదన్‍, కిరణ్‍కుమార్‍, తిరుమల్‍, గిరి కుమార్‍ 
పాల్గొన్నారు.

వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ రూ.300 కోట్ల టర్నోవర్

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కోఆపరేటివ్ బ్యాక్ టర్నోవర్ రూ.300 కోట్లకు చేరువైందని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెల్లడించారు. గురువారం బ్యాంక్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిరు వ్యాపారులకు సైతం డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్తృతం చేయాలన్న నేపథ్యంలో తాము మరింత పనిచేస్తున్నామన్నారు.

నెక్కొండలో సూపర్ ఫాస్ట్ రైళ్లను ఆపాలి

నెక్కొండ/నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్​లో ఐదు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్​లకు హాల్టింగ్ కల్పించాలని బీజేపీ స్టేట్​ లీడర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్​ను కోరారు. ఈమేరకు గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. శాతవాహన, ఇంటర్ సిటీ, గౌతమి, పద్మావతి, నవజీవన్ ఎక్స్‌‌‌‌ ప్రెస్ రైళ్లకు నెక్కొండలో హాల్టింగ్​ఇవ్వాలన్నారు. దీని వల్ల ఆరు మండలాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి  సానుకూలంగా స్పందించారని, త్వరలోనే హాల్టింగ్​ ఆర్డర్స్ ​రానున్నాయని రేవూరి ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రేవూరి మర్యాదపూర్వకంగా కలిశారు.

టీఆర్ఎస్​ లీడర్లతో అరూరి మీటింగ్

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ, వరంగల్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గురువారం టీఆర్ఎస్ లీడర్లతో రివ్యూ  నిర్వహించారు. గురువారం ఎర్రగట్టుగుట్టలోని ఓ ఫంక్షన్ హాల్ లో భేటీ అయి సీఎం కేసీఆర్ ఇచ్చిన సూచనలు, సలహాలు తెలియజేశారు. పార్టీలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇక నుంచి టైం చాలా విలువైందని, ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎంపీపీ కేతపాక సునీత, జడ్పీటీసీ రెనుకుంట్ల సునీత ,హనుమకొండ ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్, గండు అశోక్ యాదవ్ తదితరులు  ఉన్నారు.

స్కూల్ మధ్యలో ఆపేస్తే ఎలా? తొర్రూరులో పేరెంట్స్ ధర్నా

తొర్రూరు, వెలుగు: తొర్రూరు పట్టణంలోని నలంద హైస్కూల్​కు అనుమతి లేదనే కారణంగా ఆఫీసర్లు మూసివేయగా.. గురువారం పేరెంట్స్ ధర్నాకు దిగారు. అకడమిక్ ఇయర్ మధ్యలోనే స్కూల్​ను సీజ్ చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే చెక్ చేయకుండా ఆఫీసర్లు ఏం చేశారని నిలదీశారు. ఆఫీసర్ల చర్యలతో 650మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డునపడిందన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో స్పందించి, ఈ అకాడమిక్ ఇయర్ వరకు నలంద స్కూల్ కొనసాగించాలని కోరారు. కాగా, ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడికి చేరుకున్నారు. పలువురు పేరెంట్స్​ను పీఎస్ కు తరలించారు.

కేయూ ఇన్ చార్జి రిజిస్ట్రార్ గా శ్రీనివాసరావు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ ఇన్​చార్జి రిజిస్ట్రార్ గా ప్రొ. టి. శ్రీనివాసరావు నియమితులయ్యారు. గతేడాది రిజిస్ట్రార్​ గా బాధ్యతలు తీసుకున్న ప్రొ.బి.వెంకట్రామిరెడ్డి ఏడాది పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎస్​డీఎల్​సీఈ డైరెక్టర్​గా ఉన్న టి.శ్రీనివాసరావును నియమిస్తూ గురువారం ఉన్నతాధికారులు ఆర్డర్స్​ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం, ఎస్ఎఫ్​సీ స్టూడెంట్లకు హాస్టల్స్​ కేటాయింపు విషయంలో వివిధ విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనకు దిగగా.. వెంకట్రామిరెడ్డి కొద్దిరోజుల కింద రాజీనామా చేసే ప్రయత్నం చేశారు. కానీ కొందరు ఆఫీసర్ల విజ్ఞప్తి మేరకు పదవీకాలం ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. నవంబర్​16తో ఆయన పదవీకాలం ముగియగా.. ఎక్స్​ టెన్షన్​ తీసుకునేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం ఇన్​చార్జి రిజిస్ట్రార్ గా ఎన్నికైన శ్రీనివాసరావు మరో మూడు నెలల్లో రిటైర్ కానున్నారు. దీంతో  మూడు నెలల తరువాత ఆ స్థానం మళ్లీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

ఆగని ఇసుక దందా

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. తరచూ పోలీసులు అరెస్టులు చేస్తున్నా వ్యాపారుల్లో తీరు మారడం లేదు. గురువారం మండలంలో కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల్లో టాస్క్ ఫోర్స్ సీఐ నరేశ్, వెంకటేశ్వర్లు దాడులు నిర్వహించారు. ఇసుక ఫిల్టర్ చేస్తున్న 30 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం ఎస్సై రామారావుకు అప్పగించారు.