కేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

కేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

పశ్చిమబెంగాల్‭లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు.. రాళ్లదాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి.. మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు తృణమూల్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా.. వారు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఇక ఈ దాడి పై నిళిత్ ప్రమాణిక్ మండిపడ్డారు. ఓ కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ లో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో అర్థం అవుతుందన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. హింసకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

తృణమూల్ కార్యకర్తలు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ అన్నారు. అక్రమార్కులకు టీఎంసీ ఆశ్రయం ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య స్పందించారు. కేంద్ర మంత్రి కారుపై ఈ విధంగా దాడి జరిగితే, రాష్ట్రంలోని సామాన్య ప్రజల భద్రత గురించి ఆలోచించండి అని అన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 355 విధించేందుకు గవర్నర్ చర్యలు ప్రారంభించాలని భట్టాచార్య డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుల కాల్పుల్లో ఇటీవల మృతి చెందిన ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి చనిపోగా.. అందుకు నిరసనగానే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నట్లు టీఎంసీ నాయకులు చెబుతున్నారు.