టీఎంయూలో రెండు వర్గాలు కలవలేదు

టీఎంయూలో రెండు వర్గాలు కలవలేదు

టీఎంయూలో రెండు వర్గాలు కలవలేదు
అదంతా అబద్ధం.. ఆర్టీసీ కార్మికులు నమ్మొద్దు: తిరుపతి 

హైదరాబాద్, వెలుగు : టీఎంయూలోని రెండు వర్గాలు కలవలేదని, అదంతా అబద్ధమని యూనియన్ అధ్యక్షుడు తిరుపతి తెలిపారు. మంగళవారం విద్యానగర్ లోని టీఎంయూ ఆఫీసులో రాష్ర్ట కమిటీ మీటింగ్ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీఎంయూ జనరల్ సెక్రటరీగా ఉన్న ఏఆర్ రెడ్డి.. రాష్ర్ట కమిటీని, ఇతర నేతలను సంప్రదించకుండా మరో వర్గంలోకి వెళ్లారు. టీఎంయూలో రెండు వర్గాలు కలిసిపోయాయని ఈ నెల 9న ఆయన ప్రకటించారు. కానీ అదంతా అబద్ధం. యూనియన్ ను బలహీనపరచడానికే ఇలా చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు గురికావొద్దు. ద్రోహుల మాటలు నమ్మొద్దు” అని తిరుపతి చెప్పారు. ఏఆర్ రెడ్డిని జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ రాష్ర్ట కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆయన స్థానంలో టీఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న అశ్వత్థామరెడ్డిని ఎన్నుకున్నామని వెల్లడించారు.

ఈ నెల చివరి వారంలో టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశమై, రాష్ర్ట కమిటీని ఎన్నుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘‘మునుగోడు ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీకి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ యూనియన్ లో రెండు వర్గాలు ఉన్నాయన్న సాకుతో ఆర్టీసీ సమస్యలను సాగదీసేందుకు ప్రయత్నిస్తోంది. యూనియన్ లో వర్గాలన్నది ఇంటర్నల్ ఇష్యూ. మునుగోడు ఎలక్షన్ కు ముందు కూడా రెండు వర్గాలు ఉన్నాయి. మరి అప్పుడు డీఏలు ఎలా ఇచ్చారు” అని ప్రశ్నించారు. రెండు వర్గాలు కలవాలని ప్రభుత్వం కోరితే ఆలోచిస్తామన్నారు. టీఎంయూ రాష్ర్ట కమిటీలో మొత్తం 58 మంది ఉన్నారని, మీటింగ్ కు 46 మంది వచ్చారని అశ్వత్థామరెడ్డి చెప్పారు. యూనియన్ నుంచి ఒక్కరు వెళ్లినంత మాత్రాన రెండు వర్గాలు కలిసినట్లు ఎట్ల అవుతుందని ప్రశ్నించారు. యూనియన్ వివాదంపై హైకోర్టులో కేసు కొనసాగుతోందని, ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

నన్ను సస్పెండ్ చేసే అధికారం లేదు:  ఏఆర్ రెడ్డి 

టీఎంయూ జనరల్ సెక్రటరీ పదవి నుంచి నన్ను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర కమిటీకి లేదు. రిటైర్ అయిన నేతలతో రాష్ర్ట  కమిటీ మీటింగ్ పెట్టారు. యూనియన్ బై లా ప్రకారం 1/3 వంతు మెజారిటీ ఉంటేనే జనరల్ సెక్రటరీని పదవి నుంచి తొలగించే అధికారం  ప్రెసిడెంట్ కు ఉంటుంది. టీఎంయూలో 35 వేల మంది ఉన్నారు. వీరిలో 12 వేల మంది అంగీకరించాలి. అశ్వత్థామరెడ్డి 2021లో ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

ఏఆర్ రెడ్డి సస్పెన్షన్.. 

యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఏఆర్ రెడ్డిని టీఎంయూ జనరల్ సెక్రటరీ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ లెటర్ ను ఆయన పని చేస్తున్న నిర్మల్ డిపోకు, ఆర్టీసీ ఎండీకి, లేబర్ కమిషనర్ కు పంపింది. భవిష్యత్తులో యూనియన్ పేరుతో  కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొంది.