ఆర్టీసీ కార్మికుల మృతికి యూనియన్లదే బాధ్యత: హైకోర్టు

ఆర్టీసీ కార్మికుల మృతికి యూనియన్లదే బాధ్యత: హైకోర్టు

సమ్మెకు పిలుపునిచ్చింది యూనియన్ నాయకులే కాబట్టి ఆర్టీసీ కార్మికుల మృతికి వాళ్లే బాధ్యత వహించాలని తెలిపింది హైకోర్టు.  అంతేకాదు కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వలేమంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల అంశంపై హైకోర్టులో మంగళవారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తీరు కారణంగానే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన కోర్టు ఆత్మహత్య చేసుకోవడానికి, గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని.. ప్రభుత్వం కారణంగానే చనిపోయారనడానికి ఆధారాలేంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కార్మికులను డిస్మిస్ చేసినట్లు ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు కదా అని చెప్పింది. అయితే ప్రభుత్వం తీరుతోనే ఆత్మహత్యలు చేసుకున్నట్లు పలు సూసైడ్ నోట్‌లను కోర్టు ముందుంచారు పిటిషనర్. వీటిని పరిశీలించిన కోర్టు.. సమ్మెకు పిలుపునిచ్చింది యూనియన్ నాయకులే కాబట్టి ఆర్టీసీ కార్మికుల మరణాలకు వాళ్లే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్తే అరెస్టులు చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల కార్మికులు మరింతమంది ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కోర్టు డిపోలోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.  తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేసింది హై కోర్టు.