CAA నిరసనల్లో హింస వద్దు: ఒవైసీ

CAA నిరసనల్లో హింస వద్దు: ఒవైసీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్లో హింసకు తావులేకుండా చూసుకోవాలని సూచించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పోలీసుల అనుమతి తీసుకుని, శాంతియుతంగా నిరసన తెలపాలన్నారు. హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ హెడ్ ఆఫీస్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ శుక్రవారం నాడు సమావేశమైంది.

ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ CAAను అందరూ బలంగా వ్యతిరేకించాల్సిందేనని అన్నారు. అయితే నిరసన చేపట్టే ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. లక్నో, ఢిల్లీల్లో హింస చెలరేగడంతో పోలీసులు దారుణంగా వ్యవహరించారని అన్నారు ఒవైసీ. కర్ణాటకలోని మంగళూరులో పోలీసు కాల్పుల్లో ఇద్దరు ముస్లింలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నిరసనల్లో హింస జరగకుండా చూసుకోవాలని ఆందోళనకారులకు సూచించారాయన.