కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల ఫ్రీజ్​పై యూఎన్ కామెంట్

కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల ఫ్రీజ్​పై యూఎన్ కామెంట్
  • రాజకీయ, ప్రజల హక్కులు కాపాడాలి
  • స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని యూఎన్ సూచన

యూఎన్: ఎన్నికలు జరుగుతున్న ఇండియాతో సహా అన్ని దేశాల్లో రాజకీయ, ప్రజల హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ అధికార ప్రతినిధి స్టీఫెన్‌‌‌‌ డుజారిక్‌‌ అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించే పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను అధికార పార్టీ ఫ్రీజ్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను అరెస్ట్ చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు?’’ అని అక్కడి మీడియా అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ డుజారిక్ పైవిధంగా స్పందించారు. ‘‘ఇండియాతో పాటు చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వాలపై ఉంది. రాజకీయ హక్కులను రక్షించాల్సించాల్సిన అవసరం ఉంది. ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. హక్కుల పరిరక్షణ దిశగానే ఇండియా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం’’అని డుజారిక్ అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్​తో పాటు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయడంపై అమెరికా కూడా ఈ తరహా కామెంట్లే చేసింది. దీంతో ఇండియాలో ఉన్న అమెరికా దౌత్యవేత్తకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఇండియా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ వైఖరి కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. దీనికి ముందు జర్మనీ కూడా కేజ్రీవాల్​కు మద్దతుగా కామెంట్లు చేయగా.. కేంద్రం అభ్యంతరం తెలిపింది.