వెలుగు స్పెషల్ : విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోంది?

వెలుగు స్పెషల్ : విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోంది?

మన దేశంలో పూర్వ రోజుల నుంచే విశ్వవిద్యాలయాల్లో జరిగే చర్చలకు, పరిశోధనలకు గొప్ప ప్రాధాన్యం ఉండేది.  ప్రాచీన కాలంలోనే నలంద, తక్షశిలలాంటి విశ్వవిద్యాలయాలుండేవి. ఎన్నో  విశ్వవిద్యాలయాలు లక్షలాది మంది మేధావులను,  రాజకీయ నాయకులను, శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను,  బ్యూరోక్రాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను,  సామాజిక కార్యకర్తలను ప్రపంచానికి అందించాయి.  సమాజ నిర్మాణంలో వారు తమదైన పాత్రను పోషించారు.  మన రాష్ట్రంలో  సైతం ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాలకు సైతం వాటికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా మన  విశ్వవిద్యాలయాలు నిర్మాణాత్మక పాత్రను పోషించాయి.  

విశ్వవిద్యాలయంలో విద్యతోపాటే  సమాజానికి  సంబంధించిన చర్చ సైతం జరగాలి.  విశ్వవిద్యాలయాలలో వివిధ భావజాలాలు ఉంటాయి. వివిధ భావజాలాలను ముందుకు నడిపే వ్యక్తుల సమూహం ఉంటుంది. ఆయా భావజాలాలపై చర్చ సైతం జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడే విద్యార్థులు  సమాజంలోని సమస్యలను అధ్యయనం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఎదగగలరు.  అలా ఎదిగినప్పుడే విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఎదిగిన నాయకత్వం సమాజంలోని సమస్యలపై స్పందించి,  ప్రశ్నించి  దేశానికి,  దేశ ప్రజలకు నాయకత్వం వహించగలరు. 

ప్రశ్నించే వాతావరణం ఉండాలి

నేడు రాష్ట్ర,  దేశ రాజకీయాల్లో తమదైన పాత్ర పోషించిన అనేకమంది నాయకులు విద్యార్థి రాజకీయాల నుండి వచ్చినవారే.  అయితే విశ్వవిద్యాలయంలోని గురువులు పాలనాపరమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మెప్పు కోసం వారికి భజన చేస్తూ,  పాలనా వ్యవహారాలు ఉన్న అధ్యాపకులు సమస్యలను  చక్కబెట్టడంరాక ప్రశ్నిస్తున్న విద్యార్థి సమాజాన్ని దోషులుగా చిత్రించే  ప్రయత్నం చేయడం సరికాదు. వాస్తవానికి విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు,  విద్యార్థులు, విశ్వ విద్యాలయం కోసం పోరాటాలు చేయాలి.  కొన్ని సంఘాలు చేస్తున్నాయి కూడా.  ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ విషయాన్ని  పాలకులు  విస్మరించకూడదు.

గురువులే  ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి 

గతంలో పనిచేసిన ఉపకులపతులకు,  రిజిస్ట్రార్లకు విద్యార్థి సంఘాల్లో పని చేసిన అనుభవం ఉండేది. విశ్వవిద్యాలయాల బాగుకోసం పాలక వర్గాలు  చేయలేనివి,  ప్రశ్నించలేనివి  ప్రభుత్వాన్ని ప్రశ్నించి విద్యార్థి  సంఘాలు తీసుకురాగలవు.  అయితే ప్రస్తుత అధికారులకు ఆ  అనుభవం లేక విశ్వ విద్యాలయంలో  గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతున్నారు.  ఎవరైనా సమస్యను పరిష్కరించమని ధర్నాలు చేసినా, వినతిపత్రం ఇచ్చినా విద్యార్థులనే తప్పుబడుతున్నారు.  

విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ,  ప్రగతి భవన్ ద్వారాలు, సెక్రటేరియట్ ద్వారాలు దూకినవారు. వీరు ఉప కులపతులు, రిజిస్ట్రార్,  ప్రిన్సిపాల్ కార్యాలయాల ముందూ ధర్నాలు చేయగలరు. అయితే ధర్నాలు సాకుగా చూపి  నిర్మాణాత్మక ఆలోచన చేయడంలో విశ్వ విద్యాలయాల పాలకవర్గాలు విఫలం అవుతున్నాయి. 

 ఏ విశ్వవిద్యాలయంలోనైనా  సమస్యలను పరిష్కారం చేయడానికి అధ్యాపకులకు సంఘాలు, నేతలు ఉన్నట్లుగానే.. విద్యార్థులకు కూడా విద్యార్థి నాయకులు ఉంటారు. వాస్తవానికి అసలు ప్రశ్నించే తత్వంను నేర్పాల్సిందే గురువులు. మరి అటువంటి గురువులే  ప్రశ్నించేవారిని వారించడం సమంజసమేనా అనేది సమాజమే నిర్ణయించాలి. 

వసతి గృహాలు సరిపోవడం లేదు

ఈ మధ్య కాలంలో నిజాం కళాశాలలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వసతి గృహం కోసం విద్యార్థులు ధర్నాలు చేశారు,  కాకతీయ విశ్వ విద్యాలయంలో వసతి కోసం,  హాల్ టికెట్లలో పేరు తప్పు నమోదు అయ్యాయి అని, సెల్ఫ్ ఫైనాన్సు కోర్సులను  రెగ్యులర్ కోర్సులగా 
మార్చాలని,  జేఎన్టీయూలో సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన విద్యార్థులకు వసతి గృహాలు ఇవ్వాలని, ఫీజుల దోపిడీని ఆపాలని విద్యార్థులు గళమెత్తారు. 

 అవినీతిని అంతమొందించాలని ఉద్యమాలు ప్రారంభం అవగానే విశ్వవిద్యాలయ అధికారులు  ప్రాథమిక విచారణ చేయకుండానే,  సమస్యలను పరిష్కరించాల్సింది పోయి  విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. వసతి గృహాలు సరిపోవడం లేదు. వాళ్ళు నాన్ బోర్డర్స్, వాళ్లు విద్యార్థులను తప్పు దారిపట్టిస్తున్నారు, విద్యార్థులకు ఏం సమస్యలు లేవు అంటారు.  నిధులు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. విశ్వ విద్యాలయం ఎలా నడిపించాలి,  గురువులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని అంటారు, 
విద్యార్థులకు ఏ సమస్యలు లేకపోతే ఎందుకు రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మీదికి వస్తారు?.

విలువలు నేర్పాలి

దయనీయ పరిస్థితుల్లో ఉన్న విశ్వవిద్యాలయాలను బాగు చేయాల్సింది పోయి పదవుల కోసం, ఉన్నత అధికారుల మెప్పు కోసం  విద్యార్థి సంఘాలను, ఆయా సంఘాల నాయకులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదు.   ధర్నాలు చేసుకునే కదా సమస్యలు పరిష్కరించుకోవాల్సింది అనే విషయంపై అధ్యాపకులు, ఉన్నతాధికారులు పునరాలోచన చేసుకోవాలి.  

విద్యార్థులు ఎవరో దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఎందుకు జీవించాలి.  ఫలనా కోర్సుకు వసతి ఇవ్వలేం  అన్నప్పుడు ఆ విషయాన్ని వెబ్ ఆప్షన్లలోనే ఎందుకు పొందుపరచడం లేదు? తమ తప్పులను కప్పి పుచ్చుకునే అధికారులను చూసి విద్యార్థులు ఏం విలువలు నేర్చుకోవాలి?  ఇప్పటికైనా విశ్వవిద్యాలయాలు  విద్యార్థులకు విద్యతోపాటు, విలువలను,  ప్రశ్నించే ప్రవృత్తిని నేర్పాలి.  

- జవ్వాజి దిలీప్
వ్యవస్థాపక అధ్యక్షుడు, 
స్టూడెంట్స్ ప్రొటెక్షన్ 
ఫోరం, జేఎన్టీయూ