అటకెక్కిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు

అటకెక్కిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు
  • రెండేండ్ల కింద బోర్డు నియామకం 
  • క్లారిటీ కోసం రాష్ట్రపతికి అప్పటి గవర్నర్ లేఖ 
  • ఆ తర్వాత దాని ఊసే ఎత్తని గత బీఆర్ఎస్  సర్కారు 
  • కాంగ్రెస్  ప్రభుత్వంపై అభ్యర్థులు, స్టూడెంట్ల ఆశలు

హైదరాబాద్, వెలుగు : సర్కారు యూనివర్సిటీల్లో ఏండ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తీసుకొచ్చిన యూనివర్సిటీ కామన్  రిక్రూట్ మెంట్ బోర్డు అటకెక్కింది. రెండేండ్ల కింద బోర్డును ఏర్పాటు చేసిన అప్పటి బీఆర్ఎస్  సర్కారు.. గవర్నర్  పేరు చెప్పి ఆ తర్వాత దాన్ని వదిలేసింది. తాజాగా కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ వర్సిటీల్లో రిక్రూట్మెంట్ పై అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్  స్టాఫ్​ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని 2022 ఏప్రిల్​లో అప్పటి సర్కారు నిర్ణయించింది. 

దీనికి అనుగుణంగా జూన్​లో యూనివర్సిటీ కామన్  రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. దీని ద్వారా మెడికల్, వెటర్నరీ యూనివర్సిటీలు మినహా మిగిలిన అన్ని వర్సిటీల్లో ఖాళీలను నింపుతామని ప్రకటించింది. ఈ సందర్భంగా నలుగురితో కూడిన కమిటీని నియమించింది. బోర్డు చైర్మన్​గా హయ్యర్  ఎడ్యుకేషనల్  కౌన్సిల్ చైర్మన్ ను పెట్టగా, కళాశాల విద్యా శాఖ కమిషనర్ మెంబర్  కన్వీనర్​గా, ఎడ్యుకేషన్  సెక్రటరీ, ఫైనాన్స్  డిపార్ట్​మెంట్  సెక్రటరీ మెంబర్లుగా ఉంటారని అప్పట్లో సర్కారు జీవో16ను రిలీజ్ చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ

పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు, జేఎన్ఏఎఫ్ఏయూ, ఆర్జీయూకేటీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఉమెన్స్, ఫారెస్ట్  వర్సిటీల్లోనూ ఈ బోర్డు నియామకాలు చేపడతామని నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం పేర్కొంది. బోర్డుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టి, ఆమోదం కోసం గవర్నర్ కు పంపించారు. అయితే దీనిపై క్లారిటీ కోసం రాష్ట్రపతి భవన్​కు గవర్నర్  పంపించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలను నివృత్తి చేస్తూ రెండోసారి గవర్నర్​కు ప్రభుత్వం బిల్లును పంపించింది. ఆ తర్వాత  ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఒకదశలో మళ్లీ పాత విధానంలోనే వర్సిటీల వారీగా నియామకాలు చేపట్టాలని సర్కారు భావించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. 

ఏండ్లుగా చాలా పోస్టులు ఖాళీ

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ప్రొఫెసర్  పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఏండ్లుగా ఆయా పోస్టులు నింపకపోవడంతో న్యాక్  గ్రేడ్  కూడా వర్సిటీలకు పెరగడం లేదు. మరోపక్క ప్రొఫెసర్ల కొరతతో వర్సిటీల్లో క్వాలిఫై రిసెర్చ్  జరగడం లేదనే వాదనలూ ఉన్నాయి. అయితే, అన్ని వర్సిటీల్లో కలిపి సుమారు 4500 వరకూ టీచింగ్, నాన్ టీచింగ్  పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అప్పట్లో కామర్  బోర్డు  ద్వారా 3500 పోస్టులను భర్తీ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్  ప్రకటించారు. దీంతో త్వరలోనే ఖాళీలు నింపుతారని నిరుద్యోగులు, విద్యార్థులు భావించారు. 

ప్రస్తుతం వర్సిటీల్లో చాలా డిపార్ట్ మెంట్లలో రెగ్యులర్  టీచింగ్  స్టాఫ్  లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్, పార్ట్ టైమ్  తదితర పేర్లతో సిబ్బందిని నియమించుకొని వర్సిటీలు నడుపుతున్నారు. కొత్తగా కాంగ్రెస్  ప్రభుత్వం రావడంతో  అందరిలో ఆశలు చిగురించాయి. కొత్త ప్రభుత్వం యూనివర్సిటీల డెవలప్​ మెంట్ తో పాటు రిక్రూట్మెంట్ పైనా దృష్టి పెట్టాలని స్టూడెంట్లు కోరుతున్నారు.