హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎమ్మెల్యే సబితా రెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడానికి చేవెళ్ల దవాఖానకు రాగా.. మృతుల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు కూడా నిరసన సెగ తగిలింది.
సబిత ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మంత్రులుగా పని చేసిన కూడా రోడ్డు విస్తరణ గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. ఎన్నో ఏండ్లుగా చేవెళ్ల రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక లీడర్లే రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కాగా, బాధిత కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహే శ్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరామర్శించారు.
