- ఇష్టారాజ్యంగా మారిన భారీ వాహనాల ఓనర్ల తీరు
 - పరిమితిని మించి గ్రానైట్, కంకర, మట్టి, ఇసుక తరలింపు
 - చేవెళ్ల ఘటనతో ఓవర్ లోడ్ అంశం మరోసారి తెరపైకి
 - టిప్పర్, బస్సు రెండూ ఓవర్ లోడ్‌తో ఉన్నట్లు నిర్ధారణ
 
హైదరాబాద్, వెలుగు: చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో భారీ వాహనాల ఓవర్ లోడ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఇటు కంకర టిప్పర్ అటు ఆర్టీసీ బస్సు రెండూ ఓవర్ లోడ్ తోనే ప్రయాణించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రంలో లారీలు, టిప్పర్ వంటి భారీ వాహనాల్లో పరిమితిని మించి గ్రానైట్, కంకర, మొరం, మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్ వల్ల బండ్లు నియంత్రణ కోల్పోయి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
కానీ, వీటి నియంత్రణకు రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. తనిఖీలు కూడా చేయకపోవడంతో భారీ వాహనాల ఓనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
నిబంధలు ఇవీ..
రవాణా శాఖ నిబంధనల ప్రకారం.. 10 టైర్లు గల లారీ, టిప్పర్ లలో 28 టన్నులకు మించి బరువును తరలించకూడదు. 12 టైర్ల వెహికల్ లో 31 టన్నులు, 16 టైర్లు గల వెహికల్ లో 41 టన్నుల బరువు మాత్రమే తరలించాలి. కానీ ఏ ఒక్క వాహనం కూడా ఈ నిబంధనలను పాటించడం లేదు. చాలా వాహనాలు రెండింతల లోడ్ తో వెళ్తుండడంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
చివరకు ఇలాంటి వాహనాల వల్ల జాతీయ, రాష్ట్ర రహదారులు, కల్వర్టులు కుంగిపోయి, గుంతలు పడి వందల కోట్ల నష్టం వాటిల్లుతున్నది. అయినా, రవాణా శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తిచూడడం లేదనే విమర్శలున్నాయి. యజమానుల నుంచి వచ్చే మామూళ్లే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బస్సులోనూ ఇదే పరిస్థితి..
సాధారణంగా బస్సులో 36 నుంచి 54 సీట్ల దాకా ఉంటాయి. కానీ చేవెళ్లలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఓవర్ లోడ్ లో ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఫిట్‌నెస్ పరంగా ట్రక్ , బస్ సరిగ్గానే ఉన్నప్పటికీ ఓవర్ లోడ్ వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఓవర్ లోడ్‌తో వేగంగా వెళ్లే టిప్పర్లు, లారీలను తనిఖీలు చేయని ఆర్టీఏ అధికారులు.. ఆర్టీసీ బస్సుల తనిఖీల్లోనూ వెనుకబడ్డారు.
ఓవర్ లోడ్‌లో ఉన్న వాహనాలు డ్రైవర్ల నియంత్రణలో ఉండవని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓవర్ లోడ్ లో వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురవుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. ఈ క్రమంలో చేవెళ్ల  ఘటనతో వెహికల్స్ ఓవర్ లోడింగ్ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారడంతో  సోమవారం సాయంత్రం రవాణా ఉన్నతాధిరుల సమీక్షలో  ఓవర్ లోడ్ వెహికల్స్ పై మూడింతలు జరిమానా విధించాలనే ఆదేశాలు వెలువడ్డాయి. 
 
