మెజార్టీపైనే దృష్టి పెట్టాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మెజార్టీపైనే దృష్టి పెట్టాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ఈ వారం రోజులు కీలకం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • నియోజకవర్గ ఇన్‌‌చార్జ్‌‌లు, బూత్ పరిశీలకులతో సమావేశం 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, మెజార్టీపై నేతలు దృష్టి పెట్టాలని పార్టీ నేతలను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు. సోమవారం ఇందిరా భవన్‌‌లో జరిగిన నియోజకవర్గ ఇన్‌‌చార్జ్‌‌లు, బూత్ పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న నాయకులు నిర్లక్ష్యంగా ఉండొద్దని, వచ్చే వారం రోజులు చాలా కీలకమని పేర్కొన్నారు. మెజార్టీపై దృష్టి పెట్టాలని కోరారు. 

ఇంటింటి ప్రచారంపైనా ఫోకస్‌‌ పెట్టాలని సూచించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాంగ్రెస్‌‌ పార్టీపై, ప్రభుత్వంపై జరుగుతున్న నిరాధారమైన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. ఇకపై ప్రతి రోజు ఉప ఎన్నికల ప్రచార సరళీ, జనం నాడి, బాధ్యతలు అప్పగించిన నేతల పనితీరుపై చర్చించేందుకు రాత్రి 11 గంటలకు జూమ్‌‌లో నేతలతో సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రచారానికి ఏడు మహిళా గ్రూపులు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం కోసం ఏడు మహిళా గ్రూపులను పీసీసీ ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోని మహిళా ఓటర్లను కలిసి కాంగ్రెస్ అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాల గురించి వీరు వివరించనున్నారు. ఒక్కో డివిజన్‌‌ బాధ్యతను పార్టీలోని కీలక మహిళా నేతలకు అప్పగించింది.