యూనివర్సిటీ వీసీపై స్టూడెంట్ లీడర్ దౌర్జన్యం

యూనివర్సిటీ వీసీపై స్టూడెంట్ లీడర్ దౌర్జన్యం

కోల్కతా : బెంగాల్ అలియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ మహమూద్ అలీని  ఓ స్టూడెంట్ లీడర్ దూషించిన వీడియో వైరల్గా మారింది. వీడియో కాస్తా రాజకీయ దుమారం రేపింది. ఛాంబర్లో ఉన్న వైస్ ఛాన్సిలర్ వద్దకు వెళ్లిన స్టూడెంట్ యూనియన్ లీడర్ గియాసుద్దీన్ మోండల్ తాను చెప్పిన ప్రకారం పీహెచ్డీ అడ్మిషన్ల లిస్టులో మార్పులు చేయాలని వీసీని బెదిరించారు. మోండల్తో పాటు వచ్చిన మరికొందరు విద్యార్థులు వీసీ పట్ల అసభ్య పదజాలం వినియోగించడంతో పాటు బెదిరించారు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. యూనివర్సిటీలోని న్యూ టౌన్ క్యాంపస్ లో శుక్రవారం జరిగిన ఈ విషయం గవర్నర్ జగదీప్ ధంకర్ దృష్టికి వెళ్లడంతో ఘటనపై చీఫ్ సెక్రటరీ నుంచి నివేదిక కోరారు. 

ఇదిలా ఉంటే వీసీపై దౌర్జన్యానికి పాల్పడిన నిందితుడు గియాసుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నిందితునికి తృణమూల్ కాంగ్రెస్ తో సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. యూనివర్సిటీ స్టూడెంట్స్ వింగ్ నుంచి 2018లోనే మోండల్ ను బహిష్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు మోండల్ తో పాటు ఇతర విద్యార్థులు కొన్ని గంటల పాటు తనను నిర్బంధించారని వీసీ మహమూద్ అలీ చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదని అన్నారు. పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించామని అంటున్నారు.