అన్​లాక్​ చైనా : రోడ్లపైకి వచ్చి చైనీయుల ఆందోళనలు

అన్​లాక్​ చైనా : రోడ్లపైకి వచ్చి చైనీయుల ఆందోళనలు

బీజింగ్: చైనాలో జీరో కొవిడ్​ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జిన్​పింగ్​ సర్కార్​ విధించిన కఠినమైన లాక్​డౌన్​ కారణంగానే ఉరుమ్‌‌‌‌కీలోని ఓ బిల్డింగ్​లో గురువారం 10 మంది సజీవ దహనం అయ్యారని మండిపడ్డారు. మంటలు కంట్రోల్​ చేసేందుకు చాలా టైం పట్టిందని విమర్శించారు. షాంఘైలోని ఓ గవర్నమెంట్ ఆఫీస్​ ముందు వందలాది మంది ప్రజలు గుమిగూడి ‘‘జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ స్టెప్‌‌‌‌డౌన్‌‌‌‌.. అన్‌‌‌‌లాక్‌‌‌‌ చైనా..” అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. టియర్​ గ్యాస్, పెప్పర్​ స్ప్రేను ఉపయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు. పలు యూనివర్సిటీ క్యాంపస్​లలోనూ స్టూడెంట్లు నిరసన తెలియజేశారు.

దేశవ్యాప్తంగా నిరసనలు

షింజియాంగ్​ను అన్​లాక్​ చేయాలంటూ వీగర్​ముస్లింలతో పాటు అనేక మంది హాన్​ చైనీయులు డిమాండ్​ చేశారు. షింజియాంగ్​లో కోటి మంది నివసిస్తున్నారని, ఉరుమ్‌‌‌‌కీ సిటీలోనే 40లక్షల మంది ఉంటారని తెలిపారు. 3నెలలుగా కఠినమైన లాక్​డౌన్​ విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవాలని, లాక్​డౌన్​ ఎత్తేయాలంటూ జాతీయ గీతాన్ని పాడుతూ నిరసన తెలియజేశారు. ఉరుమ్​కీలో చనిపోయిన వారికి పూలు, క్యాండిల్స్‌‌‌‌తో నివాళులు అర్పించారు. ఉరుమ్‌‌‌‌కీలో చేపట్టిన నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. బీజింగ్‌‌‌‌ సరిహద్దులోనూ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఉరుమ్​కీ అధికారులు స్పందించారు. దశలవారీగా లాక్​డౌన్ ఎత్తేస్తామని ప్రకటించారు.

40వేల పాజిటివ్​ కేసులు నమోదు

శనివారం 39,501 మంది కరోనా బారినపడ్డారని చైనా నేషనల్​ హెల్త్​ కమిషన్​ ఆదివారం  ప్రకటించింది. వీటిలో 35,858 అనుమానిత కేసులుగా నమోదైనట్టు తెలిపింది. దేశమంతటా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని వివరించింది. వరుసగా నాల్గో రోజు రికార్డు స్థాయిలో కేసులు రికార్డయ్యాయి. బీజింగ్​లో 4,700 పాజిటివ్​ కేసులు వెలుగుచూశాయి. ఆదివారం నాటికి బీజింగ్​లో పాజిటివ్​ కేసుల సంఖ్య 9,694కు చేరుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లోని అపార్ట్​మెంట్లు లాక్​డౌన్​లో ఉన్నాయి. కరోనా గైడ్​లైన్స్​ పాటించాలంటూ స్టేట్ కౌన్సిల్ జాయింట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెకానిజం స్థానికులను కోరింది.