‘ఉన్నావ్’ కేసులన్నిటికి 45 రోజుల డెడ్ లైన్‌

‘ఉన్నావ్’ కేసులన్నిటికి 45 రోజుల డెడ్ లైన్‌
  • గ్యాంగ్ రేప్, సంబంధిత కేసులపై సుప్రీంకోర్టు ఆదేశం
  • బాధితురాలకి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
  • ‘యాక్సిడెంట్’ విచారణ ఏడు రోజుల్లో పూర్తి చేయాలి
  • సీబీఐకి స్పష్టం చేసిన సీజేఐ నేతృత్వంలోని బెంచ్

న్యూఢిల్లీ:  ‘ఉన్నావ్’ గ్యాంగ్​రేప్, దానికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఐదు కేసుల విచారణను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని డెడ్​లైన్ విధించింది. అన్ని కేసులను ఉత్తరప్రదేశ్​నుంచి ఢిల్లీకి తరలించాలని స్పష్టం చేసింది. ఉన్నావ్ బాధిత కుటుంబానికి జరిగిన ‘యాక్సిడెంట్’​పై దర్యాప్తును ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఒకవేళ ఏవైనా అసాధారణమైన పరిస్థితులు తలెత్తితే.. మరో ఏడు రోజుల పొడిగింపు కోరేందుకు మాత్రమే సీబీఐకి అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధితురాలికి రూ.25 లక్షల మధ్యంతర నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం ఈ మేరకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయి, జడ్జీలు జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్​లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నావ్ బాధితురాలు వెళ్తున్న కారు ప్రమాదానికి గురి కావడం.. యాక్సిడెంట్​లో కుట్ర కోణం ఉందని అనుమానాలు రావడం… తమకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టుకు జులై 12నే బాధితులు లెటర్ రాయడం, ఆ లెటర్​ను సీజేఐ పట్టించుకోలేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో గురువారం కేసును సీజేఐ నేతృత్వంలోని బెంచ్ విచారించింది.

ప్రిసైడింగ్ జడ్జిని మేం నిర్ణయిస్తాం..

ఇన్ చాంబర్ సంప్రదింపులు జరిపిన తర్వాత… కేసుల విచారణకు ప్రిసైడింగ్ జడ్జిని తాము నిర్ణయిస్తామని కోర్టు చెప్పింది. కేసుల దర్యాప్తు వేగంగా సాగేందుకు, కేసులకు సంబంధించిన నిజాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విచారణ జరిపేందుకు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, ఇందులో నిందితుల గురించి ప్రస్తావించలేదని చెప్పింది. తాము ఇస్తున్న ఉత్తర్వులను మార్చాలని లేదా రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విచారణకు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కల్పించండి

ఉన్నావ్ బాధితురాలు, ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్యూరిటీ కల్పించేందుకు అంగీకారం తెలుపుతూ కమాండెంట్ స్థాయి అధికారి వెంటనే రిపోర్టు దాఖలు చేయాలని సూచించింది. ‘‘యాక్సిడెంట్ బాధితుల పరిస్థితి ఎలా ఉంది? వారిని యూపీ నుంచి ఢిల్లీకి ఎయిర్​ అంబులెన్స్ ​ద్వారా తరలించొచ్చా” అని ప్రశ్నించింది. దీనిపై సీబీఐ నుంచి ఓరల్​గా సమాచారం సేకరించింది. బాధితుల ఫ్యామిలీ నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.

కేసులన్నీ ఢిల్లీకి..

‘ఉన్నావ్’ అత్యాచార ఘటనకు సంబంధించిన ఐదు కేసులను ఢిల్లీకి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో యూపీలోని ఓ కోర్టులో జరుగుతున్న విచారణ.. ఇకపై ఢిల్లీలోని కోర్టులో జరగనుంది. ఐదో కేసు (గత ఆదివారం జరిగిన ఉన్నావ్ బాధితులకు జరిగిన యాక్సిడెంట్​కు సంబంధించి నమోదైంది) విచారణను ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. అసాధారణ పరిస్థితులు తలెత్తితే తప్ప.. దర్యాప్తును  పొడిగించేందుకు అనుమతివ్వబోమని, ఒకవేళ ఇచ్చినా ఏడు రోజులు మాత్రమే ఇస్తామని చెప్పింది. కోర్టు శుక్రవారం కూడా విచారణను కొనసాగించనుంది. తనను రాయ్​బరేలి జైలు నుంచి ఢిల్లీలోని జైలుకు మార్చాలంటూ బాధితురాలి చిన్నాన్న దాఖలు చేసిన పిటిషన్​ను విచారించనుంది.

చిన్న కూతురుపైనా ఎటాక్‌‌ చేశారు

తన చిన్న కూతురుపై కూడా ఎమ్మెల్యే మనుషులు ఎటాక్‌‌ చేశారని ఉన్నావ్‌‌ బాధితురాలి తల్లి తెలిపింది. గురువారం ఉమెన్ రైట్స్‌‌ ప్యానల్‌‌ ఎదుట విచారణకు ఆమె హాజరైంది. “కేసు వాపస్‌‌ తీసుకోవాలని చెప్పేందుకు వచ్చిన ఎమ్మెల్యే కుల్‌‌దీప్‌‌ మనుషులు, గూండాలు నా చిన్నకూతురుపై దాడి చేశారు. మా ఆయన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ సమయంలో మా అత్తపైనా దాడి చేశారు” అని చెప్పారు.

బీజేపీ నుంచి కుల్‌‌దీప్‌‌ ఔట్‌

‘ఉన్నావ్‌‌’ కేసులో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో బీజేపీ చర్యలు చేపట్టింది. ప్రధాన నిందితుడు, ఎమ్మెల్యే కుల్‌‌దీప్‌‌ సెంగార్‌‌‌‌ను బహిష్కరించింది. హత్యాయత్నం కేసులో ఆయనపై ఆరోపణలు రావటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నాయకులు చెప్పారు. కుల్‌‌దీప్‌‌ ఈ కేసులో అరెస్టయ్యారు.

ముగ్గురు సెక్యూరిటీ పోలీసులు సస్పెండ్‌

బాధితురాలికి సెక్యూరిటీగా ఉన్న ముగ్గురు పోలీసులనూ ప్రభుత్వం సస్పెండ్‌‌ చేసింది. డ్యూటీ సరిగా చేయలేదనే ఆరోపణలతో వారిపై వేటు వేసినట్లు అధికారులు చెప్పారు. గత ఆదివారం ఉన్నావ్‌‌ బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బాధితురాలి ఇద్దరు పిన్నులు చనిపోయారు.