ఆదరణ లేని ప్రధాని పింఛన్ స్కీమ్

ఆదరణ లేని ప్రధాని పింఛన్ స్కీమ్

హైదరాబాద్‌, వెలుగు : గత బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ ధన్‌(పీఎంఎస్ వైఎం) స్కీమ్ పై రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నెలకు రూ.15 వేలలోపు ఆదాయం ఉండి… 18 నుంచి 40 ఏళ్లలోపున్న అసంఘటిత రంగ కార్మికులకు 60ఏళ్లు నిండాక నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఎల్‌ఐసీ ఆఫీస్లు, కార్మికశాఖ కార్యాలయాల్లో ఎన్ రోల్ మెంట్‌ ప్రారంభించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షలాది మంది కార్మికుల ఎన్ రోల్ మెంట్‌ జరగ్గా, బీజేపీయేతర ప్రభుత్వాలున్నచోట స్పందన అంతంత మాత్రంగానే ఉంది. హర్యానాలో అత్యధికంగా 5,87,730 మంది కార్మికులు ఈస్కీమ్లో చేరగా, మహారాష్ట్రలో 5,42,628 మంది,ఉత్తర ప్రదేశ్ లో 4,93,471 మంది, గుజరాత్ లో3,43,365 మంది, బిహార్ లో 1,23,898 మంది అసంఘటిత కార్మికులు చేరారు.

మన రాష్ట్రంలో..

రెండు నెలల్లో ఈ పథకంలో చేరిన మన రాష్ట్ర కార్మికుల సంఖ్య16 వేలు దాటలేదు. కార్మికుల ఎన్ రోల్ మెంట్ లో తెలంగాణది 19వ స్థానం. ఏప్రిల్ 14వరకు రాష్ట్రంలో స్కీమ్ లో చేరినవారు 15,547మంది కాగా, వారిలో పురుషులు 10,108,మహిళలు 5,511 మంది. ఈ స్కీమ్ లో చేరుతున్నవారిలో సగానికిపైగా గ్రామాల్లోని వ్యవసాయ కూలీలే.నాగర్ కర్నూల్ జిల్లాలో అధికంగా 1,513 మంది,ఖమ్మం లో 1,117, వరంగల్ లో 931, కరీంనగర్ లో751 మంది కార్మికు లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 47 మంది కార్మికుల ఎన్రోల్ మెంట్ తో జోగులాంబ గద్వాల జిల్లా చివరి స్థానంలో ఉంది.అసంఘటిత రంగ కార్మికులు ఎక్కు వగా ఉండే హైదరాబాద్ లో 619 మంది, రంగారెడ్డి జిల్లాలో 668మంది మాత్రమే ఈ స్కీమ్ లో చేరడం గమనార్హం.

అనాసక్తి ఎందుకు?

రాష్ట్రంలో లక్షలాదిగా అసంఘటిత కార్మికులున్నా వేలల్లోనే చేరడానికి రెండు కారణాలున్నాయి . ఈ స్కీమ్ పై ప్రచారం లేకపోవడం, అర్హత వయసు 40లోపే ఉండడం. 20 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు సుదీర్ఘ కాలం ప్రీమియం చెల్లించాల్సి రావడం కూడా కార్మికుల అనాసక్తికి మరో కారణం.